Begin typing your search above and press return to search.

జేసీకి మరో షాక్..సిమెంట్ కంపెనీ లీజు రద్దు

By:  Tupaki Desk   |   31 Jan 2020 2:20 PM GMT
జేసీకి మరో షాక్..సిమెంట్ కంపెనీ లీజు రద్దు
X
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న టీడీపీ సీనియర్ నేత - అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నిజంగానే ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ పడిపోతోంది. ఇప్పటికే జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని దివాకర్ ట్రావెల్స్ పై ఏపీ రవాణా శాఖ ముప్పేట దాడి చేస్తోంది. రవాణా శాఖ కొనసాగిస్తున్న దాడులతో బెంబేలెత్తిపోతున్న జేసీకి ఇప్పుడు మరో భారీ షాక్ తగిలింది. జేసీకి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీ కోసం అనంతపురం జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామంలో కేటాయించిన సున్నపురాయి గనుల లీజులను రద్దు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గనుల లీజును రద్దు చేయడంతోనే సరిపెట్టని జగన్ సర్కారు... ఈ గనుల్లో నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని కూడా మరింత సంచలన నిర్ణయం తీసుకుంది.

అనంతపురము జిల్లా యాడికి మండలం కొనుప్పలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 22బీలోని 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపురాతి గనులను జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి చెందిన మెస్సర్స్ త్రిషూల్ సిమెంట్ కంపెనీకి లీజుకిచ్చింది. ఈ గనుల్లో జేసీ కంపెనీ 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి ఖనిజాన్ని తవ్వి తీసిందట. అయితే ఈ ఖనిజం తవ్వకాన్ని అక్రమ వ్యవహారంగా ప్రభుత్వం తేల్చేసింది. ఈ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తీయడంతో పాటుగా అక్రమంగా రవాణా చేసిందని కూడా ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతేకాకుండా నిర్దేశిత సమయంలో ఈ గనులను వినియోగించుకుని సిమెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని ఇప్పటికీ జేసీ ఫ్యామిలీ నిర్మించలేదు. ఈ నేపథ్యంలో నిర్దేశిత కాలంలో ప్లాంట్ ను నిర్మించకున్నా కూడా... జేసీ కంపెనీకి కేటాయించిన లీజులను మరో ఐదేళ్ల పాటు పొడిగింపును ఇస్తూ గత టీడీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే జగన్ సర్కారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయా సంస్థలు, వ్యక్తులకు కేటాయించిన లీజులపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ గనుల తవ్వకాలపై సీబీఐ దర్యాప్తునకు ఇప్పటికే ఓకే చెప్పేసింది. అదే క్రమంలో జేసీ కంపెనీ కూడా అక్రమంగా సున్నపురాయి ఖనిజాన్ని తవ్వి తీసి, అక్రమంగా రవాణా చేసి అమ్మేసుకుందని ఇప్పుడు విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్రిషూల్ సిమెంట్ కంపెనీకి సున్నపురాయి గనులను కేటాయిస్తే.. సిమెంట్ ప్లాంట్ నే నిర్మించకుండా జేసీ ఫ్యామిలీ ఖనిజాన్ని తవ్వి తీయడంతో ప్రభుత్వం ఈ దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా గనుల లీజును రద్దు చేయడంతో పాటుగా త్రిషూల్ కు చంద్రబాబు సర్కారు ఇచ్చిన గడువు పొడిగింపును కూడా రద్దు చేయడంతో పాటుగా అక్రమంగా ఖనిజం తవ్వడం, తరలింపుపై విచారణకు ఆదేశిస్తూ జగన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ దెబ్బతో జేసీ మరింతగా ఇబ్బందికి గురి కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.