Begin typing your search above and press return to search.

పాపం పండితే కరోనాలొస్తాయి: జేసీ

By:  Tupaki Desk   |   7 April 2020 8:50 AM GMT
పాపం పండితే కరోనాలొస్తాయి: జేసీ
X
ఏపీకి చెందిన రాయలసీమ రెడ్డప్ప జేసీ దివాకర్ రెడ్డి నోటి నుంచి అణిముత్యాలు ఎప్పుడూ రావు.. మాటల తూటాలు.. విమర్శలే వస్తాయి. పదునైన పంచులతో ఎన్నో వివాదాలు రాజేసే జేసీ దివాకర్ రెడ్డి ఈ కరోనా టైంలో ఎంచక్కా అనంతపురం జిల్లాలోని జూటూరులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నాడు. తాజాగా ప్రబలిన కరోనా వైరస్ పై ఆయన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి, దేవుడు ఇలాంటిది ఒకటి సృష్టించి జనాలను తగ్గిస్తుంటాడని.. ఇప్పుడు కూడా కరోనా వైరస్ ని సృష్టించాడని జేసీ సంచలన కామెంట్స్ చేశాడు. కరోనా వంటి కష్టమైన పరిస్థితిని తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని పేర్కొన్నారు.

ప్రతీ 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటివి జరుగుతున్నాయని.. పాపం అంటే చంపడం.. నరకడం కాదని.. దుర్మార్గమైన వాతావరణాన్ని సృష్టించడమని జేసీ అన్నారు. దేవుడు, ప్రకృతి తనంతట అదే కేర్ తీసుకుంటుంది అని అన్నారు. కొంత కంట్రోల్ చేయడానికి చూస్తుందన్నారు.

కరోనా మానవ జాతికి ఓ హెచ్చరిక అని.. శుభ్రంగా ఉండాలని ప్రకృతి హెచ్చరిస్తోందని జేసీ అన్నారు. కరోనా నియంత్రణకు పోలీసులు, డాక్టర్లు బాగా పోరాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. దీన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం కరోనాను ఉపయోగించుకో వద్దన్నారు.

కరోనా విషయంలో ప్రధాని మోడీ చాలా కష్టపడుతున్నాడని.. తప్పు జరిగితే ప్రజలదే తప్పు అని.. ప్రభుత్వాలది కాదన్నారు. ఏపీ సీఎం జగన్ మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారని జేసీ ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందని జగన్ చెప్పారని.. జగన్ తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తనకు తెలియదని జేసీ ఆరోపించారు.

కరోనా రాకూడదంటే వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉండాలని.. అందుకే తాను ఫాంహౌస్ కు వచ్చానని జేసీ తెలిపారు. తాను ఈసారి పండిన పంటలతో కోటి రూపాయలు సంపాదించానని జేసీ గర్వంగా తెలిపాడు.