Begin typing your search above and press return to search.

కేంద్రం, చంద్రబాబు దొందూదొందేనన్న జేసీ

By:  Tupaki Desk   |   27 Feb 2017 10:54 AM GMT
కేంద్రం, చంద్రబాబు దొందూదొందేనన్న జేసీ
X
ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాకే దిక్కు లేనప్పుడు అసెంబ్లీ సీట్లు ఒక లెక్కా అని అన్నారు. కేంద్రానికి ఏపీ విషయంలో ఏమాత్రం చిత్త శుద్ధి లేదని తేల్చేశారు. కేంద్రం ఇవ్వదని తెలిసినా సీఎం మాత్రం గంపెడాశతో ఉన్నారంటూ చంద్రబాబుకు చురకలేశారు.

ఏపీలో కొత్త అసెంబ్లీ భవనాన్ని పరిశీలించిన జేసీ ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. భవనం బాగుందని మెచ్చుకున్నారు. స్పీకర్‌ పై దాడులు చేయడానికి అవకాశం లేకుండా ఏర్పాట్లున్నాయని.. కాబట్టి ఆయన సేఫ్‌ గా ఉండొచ్చని అన్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225కు పెంచకపోవడంపై మాట్లాడుతూ.. మన రాష్ట్రంపై కేంద్రానికి చిత్తశుద్ది లేదని జేసీ వ్యాఖ్యానించారు. సీట్ల పెంపు అంశంపై తాను మాట్లాడాల్సి వస్తే ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన హామీకే దిక్కులేనప్పుడు ఇక సీట్ల పెంపు జరక్కపోవడంపై ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. అంతా రాజుగారిచిత్తం అన్నట్టుగా ఏపీ పరిస్థితి తయారైందన్నారు.

అయితే.. జేసీ వ్యాఖ్యలు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. సీట్ల పెంపు గురించి మాట్లాడాలంటే తాను చాలా చెప్పాల్సి వస్తుందని అనడం వెనుక ఏదో మతలబు ఉందని పరిశీలకులు అంటున్నారు. జేసీ ఊరికే ఆ మాట అనరని.. దానికి రాజకీయాలకు ఏదో లింకు ఉందని అంటున్నారు. చంద్రబాబు దానికోసం ప్రయత్నించడం లేదన్నది జేసీ ఉద్దేశం కావొచ్చని.. అయితే, దాన్ని ఓపెన్ గా చెప్పలేక నెపం కేంద్రంపై నెట్టేసి ఉంటారని భావిస్తున్నారు. ఏమైనా అసలు రహస్యం జేసేకే ఎరుక.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/