Begin typing your search above and press return to search.

నంద్యాల ఓట‌ర్లూ... జేసీ మాట విన్నారా?

By:  Tupaki Desk   |   4 Oct 2017 12:21 PM GMT
నంద్యాల ఓట‌ర్లూ... జేసీ మాట విన్నారా?
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల్సిందేన‌న్న భావ‌న‌తో టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ది మంత్రం ప‌ఠించారు. టీడీపీ స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాదాపుగా మూడేళ్ల‌కు పైగా నంద్యాల అభివృద్దికి సింగిల్ పైసా విద‌ల్చ‌ని చంద్రబాబు... ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న‌గా అక్క‌డ వాలిపోయారు. నంద్యాల‌ను మోడ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంగా అభివృద్ది చేస్తానంటూ భారీ ప్ర‌క‌ట‌న‌లు గుప్పించేసి... నంద్యాల ప‌ట్ట‌ణంలో రోడ్ల విస్త‌ర‌ణ‌తో పాటు ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టేశారు. నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌తిసారీ... రాత్రి పొద్దుపోయేదాకా అధికారులు, స్థానిక టీడీపీ నేత‌ల‌తో స‌మీక్ష‌లు చేసిన చంద్రబాబు... నంద్యాల ప్ర‌జ‌లు అడిగిన ఏ ఒక్క అభివృద్ధి ప‌నికి నో చెప్ప‌డానికి వీలులేద‌ని ఆర్డ‌రేశారు. నంద్యాల ప్ర‌జ‌లు అడిగిందే త‌డ‌వుగా ముందూ వెనుకా చూసుకోకుండా అభివృద్ధి ప‌నుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయాల్సిందేన‌ని కూడా స్ప‌ష్టంగా చెప్పారు.

ఈ క్ర‌మంలో నంద్యాల‌లో అప్ప‌టిదాకా ప్ర‌తిపాద‌న‌ల ద‌శ‌ల్లోనే ఉన్న ప‌లు అభివృద్ధి .ప‌నుల‌కు రాత్రికి రాత్రే గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. వంద‌ల కోట్లు దాటి ఆ ప‌నుల విలువ వెయ్యి కోట్ల‌కు పైగా చేరింది. అయినా కూడా ఏమాత్రం ఆలోచించ‌ని చంద్రబాబు స‌ర్కారు ఆ ప‌నుల‌కు ప‌చ్చ జెండా ఊపేయ‌డంతో పాటు ఉన్న‌ప‌ళంగా ప‌నుల‌ను ప్రారంభించేసింది. అంతేకాకుండా అభివృద్ధి ప‌నుల‌తో పాటు ఓటుకు ఇంత అంటూ టీడీపీ నేత‌లు విచ్చ‌ల‌విడిగా తాయిలాలు పంపిణీ చేశారు. ఇంకేముంది... ఇంకొన్ని రోజుల్లో నంద్యాల ప‌ట్ట‌ణం రూపురేఖ‌లే మారిపోతాయ‌ని భావించిన అక్క‌డి ఓట‌ర్లు ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓట్లేశారు. అయితే ఇదంతా అర‌చేతిలో స్వ‌ర్గం చూప‌డ‌మేన‌ని, నంద్యాల అభివృద్ధి ప‌నుల‌కు ఇప్ప‌టిదాకా సింగిల్ పైసా కూడా విడుద‌ల కాలేద‌న్న స‌త్యం ఇప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది ప్ర‌తిప‌క్షానికి చెందిన నేత‌ల‌నుకుంటే... మ‌నం పప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే... ఈ విష‌యాన్ని మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ బ‌ట్ట‌బ‌య‌లు చేసిన వ్య‌క్తి అధికార టీడీపీకి చెందిన కీల‌క నేతే. ఆయ‌నే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి.

నిన్న అనంత‌పురంలోని త‌న కార్యాల‌యంలో మీడియా స‌మావేశం పెట్టిన జేసీ... అనంత‌పురంలో త్వ‌ర‌లో మొద‌లుకానున్న రో్డ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌ను ఏక‌రువు పెట్టారు. ప‌నిలో ప‌నిగా నంద్యాల‌లో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రోడ్ల విస్త‌ర‌ణ స‌హా ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఉప ఎన్నిక‌ల‌కు ముందుగా నంద్యాల‌లో ప్రారంభ‌మైన రోడ్ల విస్త‌రణ‌ - ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు చంద్రబాబు ఇప్ప‌టిదాకా సింగిల్ పైసా కూడా విడుద‌ల చేయ‌లేద‌ని జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. అదే త‌న నియోజ‌క‌వ‌ర్గం విష‌యానికి వ‌స్తే... ఇంకా ప్రారంభ‌మే కాని అనంత‌పురం రోడ్ల విస్త‌ర‌ణ ప‌నుల‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికే రూ.60 కోట్ల మేర నిధుల‌ను విడుద‌ల చేశార‌ని చెప్పారు. ఆ నిధులు రాష్ట్ర ఖ‌జానా నుంచి జిల్లాకు చేరాయని - క‌లెక్ట‌ర్ అనుమ‌తితో నేడో - రేపో క‌లెక్ట‌ర్ ఖాతాలోకి చేరిపోతాయ‌ని కూడా జేసీ చెప్పుకొచ్చారు. అంటే... నంద్యాల ప్ర‌జ‌ల‌ను ఊరించిన పనుల‌కు సంబంధించి చంద్ర‌బాబు స‌ర్కారు ఇప్ప‌టిదాకా సింగిల్ పైసా కూడా విడుద‌ల చేయ‌లేద‌న్న మాట‌. ఈ క్ర‌మంలో నంద్యాల అభివృద్ధి ప‌నులు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న ఇప్పుడు బ‌లంగా వినిపిస్తోంది.