Begin typing your search above and press return to search.

లోకేష్...ఐఏఎస్ ఒక‌టేనంటున్న జేసీ

By:  Tupaki Desk   |   22 March 2017 10:41 AM GMT
లోకేష్...ఐఏఎస్ ఒక‌టేనంటున్న జేసీ
X
టీడీపీ నేత‌ - అనంత‌పురం పార్లమెంట్‌ సభ్యుడు జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడ‌టం మొద‌లు పెడితే ఎలాంటి ఆస‌క్తిక‌ర‌మైన‌ వ్యాఖ్య‌లు వ‌స్తాయోన‌నే క్రేజ్ ఉండే సంగ‌తి తెలిసిందే. అంత‌టి వార్త‌ల్లో వ్య‌క్తి అయిన జేసీ తాజాగా ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు లోకేష్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం లోకేష్‌ కు శిక్షణ కాలం ప్రారంభమవుతోందని జేసీ విశ్లేషించారు. కొత్తగా ఎంపికైన ఒక ఐఏఎస్‌ అధికారి కలెక్టర్‌ గా మారేందుకు ఎలా శిక్షణ ఇస్తారో, లోకేష్‌ కు కూడా అటువంటి శిక్షణ ప్రారరభమవుతోందని జేసీ విశ్లేషించారు. ఈ శిక్షణ ముఖ్యమంత్రి పదవి కోసమా? అని మీడియా ప్రశ్నించ‌గా దానికి జేసీ నవ్వుతూ తల ఊపారు.

ఈ సంద‌ర్భంగా లోకేష్ ప్ర‌జా జీవితాన్ని సైతం జేసీ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. లోకేష్‌ కు మంత్రి పదవి ఇవ్వడం తప్పు కాదన్న‌ జేసీ దివాక‌ర్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్సీగా వచ్చినా, తరువాత జనం నుంచి కూడా ఎన్నికవుతాడ‌ని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీగా రావడం అడ్డదారిలో రావడం కాదన్నారు. ఆయ‌న పార్టీ త‌ర‌ఫునే ఎన్నిక‌య్యారు కదా అంటూ ఎదురు ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్‌ గురించి మాట్లాడుతూ కొత్తగా పార్టీ పెట్టిన వారు తొలిసారే గెలవాలని, లేదంటే ఇక గెలుపు సాధ్యం కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే అవకాశాలు లేవన్నారు. ఒక్కో ఓటుకు పాతిక లక్షల రూపాయలు చొప్పున ఇస్తే అప్పుడు గెలుస్తారని జేసీ వ్యాఖ్యానించారు. అది కూడా కనీసం ముందుగా సగమైనా ఓటర్లకు అందించాలని జేసీ ఎక‌సెక్కాలు ఆడారు.

బీజేపీలో వైసీపీ విలీనం కానుంద‌న్న ప్రచారం జ‌రుగుతుండ‌టాన్ని జేసీ ప్ర‌స్తావిస్తూ తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటేనే జగన్‌ విలీనానికి అరగీకరిస్తారని చెప్పారు. అయితే వేరొకరికి సీఎం పదవిని బీజేపీ ఎందుకు ఇస్తుందని జేసీ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మదిలో అనేక ఆలోచనలు ఉన్నాయని, అయితే వాటి కొన్ని అమలు చేసే పరిస్థితులు లేవని జేసీ వ్యాఖ్యానించారు. రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నా, వరుణుడు మాత్రం ముఖ్యమంత్రికి సహకరించడం లేదన్నారు. దీన్ని ప్రజలూ అర్థం చేసుకుంటున్నారని జేసీ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/