Begin typing your search above and press return to search.

పవన్ సభ ఫై జేసీ సంచల వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   28 Aug 2016 11:57 AM GMT
పవన్ సభ ఫై జేసీ సంచల వ్యాఖ్యలు
X
ఏపీ ఎంపీలపై, ప్రజాప్రతినిధులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాల నుంచి ఇంతవరకు వ్యతిరేక స్పందన రాలేదు. అధిష్ఠానం దీనిపై ఆచితూచి మాట్లాడమని చెప్పడంతో అందరూ నోరు కట్టుకుని తమను తిట్టినా కూడా పవన్ తో కలిసి పనిచేస్తామంటూ నవ్వు ముఖాలతోనే మాట్లాడారు. కానీ.. టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మాత్రం వారందరి బాటలో సాగలేదు. పవన్ వ్యాఖ్యలను తూర్పూరబట్టేశారు. పవన్ కు ఏం తెలుసని ప్రజాప్రతినిధులను కించపరిచేలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అయితే... పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు ఎలా స్పందిస్తారో తెలియదు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా చంద్రబాబును మధ్యలో పెట్టి పవన్ పై ఫైరయ్యారు. సీఎం చంద్రబాబుకు ఏమీ తెలియదనుకుంటున్నావా.. నీ వ్యాఖ్యలు చాలా తప్పు అంటూ పవన్ ను ఉద్దేశించి హితవు పలికారు.

పవన్‌ కల్యాణ్‌కు పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలుసా? ఆయనకు వయసు తక్కువ, అనుభవం కూడా లేదు, నోరుందని మాట్లాడితే ఎలా అంటూ జేసీ దివాకరరెడ్డి మండిపడ్డారు. ‘‘పవన్‌ బాబూ నువ్వు మాట్లాడుతున్న చాలా తప్పు. ప్రజాప్రతినిధులను కించపరచవద్దు” అని పెద్దరికంతో మందలించారు. పవన్ చెబుతున్నట్లు రాజీనామా చేస్తే హోదా వచ్చేస్తుందనుకుంటే ఇప్పుడే రాజీనామా చేస్తానని తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానమని జేసీ అన్నారు. రాజీనామా చేస్తే హోదా ఎలా వస్తుందో ముందు పవన్‌ కల్యాణ్ చెబితే వెంటనే రాజీనామా చేసి వస్తానన్నారు.. తాను ఒక్కడినే కాదు మొత్తం ఏపీ ఎంపీలు రాజీనామా చేసినా మోడీ దిగి వచ్చే పరిస్థితి లేదని.. ఏం చేసుకుంటారో చేసుకోండన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారని జేసీ చెప్పారు.

అంతేకాదు.. పవన్ వల్ల కూడా పని జరగదని జేసీ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ రోడ్డు మీదకు రాగానే హోదా ఇచ్చేస్తారా?. ఒకవేళ అలా జరిగితే మేమంతా పవన్ అనుచరులుగా మారేందుకు సిద్ధమని కూడా జేసీ అన్నారు. మూర్ఖపు ప్రభుత్వాలు మాట వినకపోతే దానికి ఎంపీలు ఎలా బాధ్యులవుతారని జేసీ ప్రశ్నించారు. ప్రధానిని సర్‌ అనకుండా బూతులు తిట్టాలా అని పవన్‌ నిలదీశారు. పవన్‌ కల్యాణ్ తన అన్న చిరంజీవిని తప్ప అందరినీ విమర్శిస్తున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి ఎందుకు రాజీనామా చేయలేదని జేసీ ప్రశ్నించారు. పవన్ అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని సూచించారు.