Begin typing your search above and press return to search.

అమరావతి లేదా కడప.. జేసీ సరికొత్త ఉద్యమం

By:  Tupaki Desk   |   19 Jan 2020 10:24 AM GMT
అమరావతి లేదా కడప.. జేసీ సరికొత్త ఉద్యమం
X
జేసీ దివాకర్ రెడ్డి.. ఈ రాయలసీమ రెడ్డప్ప ఏదీ మాట్లాడినా సంచలనమే.. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ అధినేతలు, ప్రతిపక్ష నేతలూ, అధికార పక్షాలు అని కూడా చూడకుండా కామెంట్ చేస్తుంటారు. తాజాగా సీఎం వైఎస్ జగన్, ఆయన మూడు రాజధానుల ప్రకటనను లక్ష్యంగా చేసుకొని కామెంట్ చేశారు.

జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ‘అమరావతిని కాకుంటే కడపను ఏపీ రాష్ట్రంగా ప్రకటించాలి’ అని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చాడు. నర్సరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

జగన్ ను ఎవరూ కాంగ్రెస్ నుంచి బయటకు పంపలేదని.. ఆయననే దూరం అయ్యాడని.. అయితే సొంతంగా ఏపీకి ముఖ్యమంత్రి అయ్యి మళ్లీ విఫలమవుతున్నాడని జేసీ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి 3 రాజధానులను ప్రతిపాదించడం ద్వారా కుల, ప్రాంత కార్డులతో ప్రజలను జగన్ రెచ్చగొడుతున్నాడని జేసీ ఆరోపించాడు.

రాష్ట్ర రాజధాని మానవ తల లాంటిదని.. అది సచివాలయం ఉన్న చోట ఉండాలని జేసీ అభిప్రాయపడ్డారు.అమరావతి నుంచే రాష్ట్ర పాలన సాగాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మినహా అసెంబ్లీ సామాన్య ప్రజలకు ఉపయోగపడనప్పుడు రాజధానిని మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని జేసీ ప్రశ్నించారు.

ఈనెల 23న రాయలసీమ ప్రజలతో చర్చా సమావేశం నిర్వహిస్తున్నామని.. అమరావతి కాకపోతే కడపను రాజధానిగా మార్చాలన్న డిమాండ్ తో ఆందోళనకు దిగుతామని జేసీ హెచ్చరించారు.