Begin typing your search above and press return to search.

జేసీ గారూ!... గోరంట్ల‌ను వ‌దిలేట్టు లేరే!

By:  Tupaki Desk   |   27 Feb 2019 9:03 AM GMT
జేసీ గారూ!... గోరంట్ల‌ను వ‌దిలేట్టు లేరే!
X
జేసీ దివాక‌ర్ రెడ్డి... సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గానే కాకుండా త‌న హోదాను ప‌క్క‌న‌పెట్టేసి నోటికి ఎంత మాట వ‌స్తే... అంత మాట అనేసే ఈజీ గోయింగ్ నేత‌గా ప్ర‌సిద్ధులు. ఈ త‌ర‌హా వైఖ‌రితో త‌న‌కు ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని తెలిసినా కూడా జేసీ వెన‌క్కు త‌గ్గ‌రు. అస‌లు వెన‌క్కు త‌గ్గితే... ఆయ‌న జేసీ ఎందుక‌వుతారు? నిజ‌మే... ఈ త‌ర‌హా వైఖ‌రితోనే జేసీ పాపుల‌ర్ అయ్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు తాను టార్గెట్ చేస్తున్న వ్య‌క్తులు త‌న‌కు స‌రి జోడా? కాదా? అన్న విష‌యాన్ని కూడా జేసీ పెద్ద‌గా ప‌ట్టించుకోరు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌తో ఎలా పోటీకి దిగుతారో - చిన్న స్థాయి ఉద్యోగులు - సామాన్యులు - చివ‌ర‌కు మీడియా ప్ర‌తినిధుల మీద కూడా ఆయ‌న అంతే స్థాయిలో బ‌రిలోకి దిగుతారు. మొత్తంగా ఈ త‌ర‌హా వైఖ‌రితో జేసీ ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గానే ఉంటారు. ఇప్పుడు ఇదే త‌ర‌హాలో పాత వివాదాన్ని మ‌రోమ‌రు కెలికేసుకునేందుకు జేసీ దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఈ వివాదం వివ‌రాలు - ఇందులో జేసీ కొత్త త‌ర‌హా చ‌ర్య‌లు ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... అనంత‌పురం జిల్లా ప్ర‌బోధానంద స్వామి ఆశ్ర‌మం వ‌ద్ద గొడ‌వ‌లు జ‌రిగిన సంద‌ర్భంగా జేసీ దివాక‌ర్ రెడ్డి పోలీసు అధికారుల‌పై కాస్తంత దురుసుగా వ్య‌వ‌హ‌రించారు. పోలీసుల మ‌నోధైర్యం దెబ్బ తినేలా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసు అధికారుల సంఘం ప్ర‌తినిధి త‌ర‌ఫున ఎంట్రీ ఇచ్చిన ఇటీవల త‌న ఖాకీ వృత్తికి వీడ్కోలు ప‌లికి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన గోరంట్ల మాధ‌వ్‌... జేసీ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. పోలీసుల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తినేలా ఎవ‌రు వ్య‌వ‌హ‌రించినా స‌హించేది లేద‌ని - నాలుక‌లు తెగ్గోస్తామంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో జేసీ అహం దెబ్బ‌తిన్న‌ద‌ట‌. ఓ ఎంపీగా ఉన్న త‌నను ప‌ట్టుకుని నాలుక కోస్తా అంటారా? అంటూ జేసీ.. గోరంట్ల‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే గోరంట్ల వ్యాఖ్య‌ల్లో ఎక్క‌డా జేసీని దూషించిన‌ట్లుగా లేద‌ని - కేసు న‌మోదు చేయ‌డం కుద‌రద‌ని తేల్చేశారు. అయినా వెన‌క్కు త‌గ్గ‌ని జేసీ... ఈ విష‌యంపై హైకోర్టు మెట్లెక్కారు. అక్క‌డా జేసీకి ప‌రాభ‌వ‌మే స్వాగ‌తం చెప్పింది.

ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధ‌వ్‌... వైసీపీలో చేరిపోయారు. వైసీపీలోకి ఆయ‌నను సాద‌రంగానే ఆహ్వానించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆయ‌న‌ను హిందూపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. ఈ ప‌రిణామం జేసీని మ‌రింత ఉడుక్కునేలా చేసింద‌నే చెప్పాలి. హైకోర్లులో త‌న వ్యూహం బెడిసికొట్టినా... మ‌రోమారు త‌న‌దైన య‌త్నాలు ప్రారంభించిన జేసీ... ఇప్పుడు మ‌ళ్లీ అనంత‌పురం జిల్లా తాడిప‌త్రి కోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఎంపీగా ఉన్న త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా దూషించిన గోరంట్ల‌పై ప్రైవేట్ కేసు దాఖ‌లు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాల‌ని ఆ పిటిష‌న్‌లో జేసీ కోర్టును కోరారు. సాధార‌ణంగా పై కోర్టులు కొట్టివేసిన కేసుల‌ను కింది కోర్టులు విచార‌ణ‌కు స్వీక‌రించ‌డం దాదాపుగా అసాధ్య‌మే. మ‌రి జేసీ... ఏ లెక్క‌న ఈ త‌ర‌హా వ్యూహం అమ‌లు చేస్తున్నారోన‌న్న చ‌ర్చ మొద‌లైంది. అంతేకాకుండా... ఈ వివాదాన్ని మ‌రిచిపోవ‌డానికి బ‌దులుగా మ‌రోమారు దానిని ర‌గ‌లించ‌డం ద్వారా జేసీకి ఎలాంటి ఫ‌లితం ఎదురు కానుంద‌న్న విష‌యంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.