Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ ను ఆక్రమించుకోవాలంటున్న జేసీ

By:  Tupaki Desk   |   18 Sep 2016 11:23 AM GMT
పాకిస్థాన్ ను ఆక్రమించుకోవాలంటున్న జేసీ
X
టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పై యుద్ధం ప్రకటించాలని ఆయన అన్నారు. యుద్ధం చేసి పాకిస్థాన్ ను స్వాధీనం చేసుకుని అఖండ భారతావనిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ముచ్చటపడ్డారు. ఈ క్రమంలో ఆయన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పది కోట్ల మంది ప్రజలు చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్ పై భారత్ యుద్ధం ప్రకటించాలని ఆయన అన్నారు.

మహాత్మాగాంధీ - జవహర్ లాల్ నెహ్రూ తప్పిదం వల్లే పాకిస్థాన్ ఏర్పాటు అయిందని, అప్పటి నేతలు ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయని ఊహించలేకపోయారని జేసీ అన్నారు. రోజు చచ్చి బతికే కన్నా - యుద్ధమే శరణ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు. జమ్మూకాశ్మీర్ లోని యూరి సెక్టార్ పై ముష్కరులు దాడి నేపథ్యంలోనే జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కేంద్రంలోని ఎన్డీయే సర్కారులో భాగస్వామ్య పార్టీ అయిన టీడీపీ ఎంపీగా ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. సగటు భారత పౌరుడిలా ఆయన ఆవేశంగా మాట్లాడినా కూడా విమర్శకులు మాత్రం యుద్ధం - ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదనుకోవడాన్ని తప్పు పడుతున్నారు.

మరోవైపు జేసీ ఈ రోజు అనంతపురం స్థానిక అంశాలకు సంబంధించి కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి - మేయర్ కు కులగజ్జి పట్టిందని ఆయన ఆరోపించారు. అనంతపురంలో జిల్లాలో విషజ్వరాలపై ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి విఫలమయ్యారని - ఎమ్మెల్యే - మేయర్ - కమిషనర్ లకు కులగజ్జి పట్టుకుందంటూ ఆరోపించారు. కులపరమైన వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వినిపిస్తున్నాయి.