Begin typing your search above and press return to search.

జేసీకి కోప‌మొస్తే... బాబైనా త‌లొంచాల్సిందే!

By:  Tupaki Desk   |   10 April 2018 9:33 AM GMT
జేసీకి కోప‌మొస్తే... బాబైనా త‌లొంచాల్సిందే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌స్తుతం సాగుతున్న ఉద్య‌మంలో విప‌క్ష వైసీపీ త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్పక తప్ప‌దు. గ‌తంలోనే ఇచ్చిన హామీ మేర‌కు త‌న పార్టీ ఎంపీల‌తో రాజీనామాలు చేయించిన ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ప్ర‌త్యేక హోదా కోసం తానూ పోరాడుతున్నాన‌ని చెప్పుకుంటున్న అధికార పార్టీ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చేశారు. అంత‌టితో ఆగ‌ని జ‌గ‌న్‌... రాజీనామాలు చేసిన ఎంపీల‌తో ఢిల్లీలోనే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌ల‌కు శ్రీ‌కారం చుట్టించేశారు. ఈ దీక్ష‌లు నేటితో ఐదో రోజుకు చేరుకున్నాయి. దీక్ష‌లు ప్రారంభ‌మైన రెండో రోజుల వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి - ఆ త‌ర్వాతి రోజు తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌ - ఆ త‌ర్వాత రోజు.... అంటే నిన్న ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అయినా కూడా దీక్ష‌లో కూర్చున్న ఇద్ద‌రు యువ ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు మొక్క‌వోనీ సంక‌ల్పంతో దీక్ష‌లు కొన‌సాగిస్తున్నారు. మొత్తంగా ఈ దీక్ష‌ల‌తో మొన్న‌టిదాకా పార్ల‌మెంటు వేదిక‌గా టీడీపీ నిర్వ‌హించిన నిర‌స‌న‌లు తేలిపోయాయ‌న్న వాద‌న వినిపించింది.

ఇదే విష‌యాన్నిగ్ర‌హించిన చంద్ర‌బాబు... వైసీపీ ఎంపీల దీక్ష‌ల‌ను మ‌రిపించేలా త‌న పార్టీ ఎంపీల‌తో కూడా బ‌స్సు యాత్ర‌కు ప్లాన్ చేశార‌ట‌. అయితే ఊహించ‌ని విధంగా చంద్ర‌బాబుకు షాకిస్తూ టీడీపీ ఎంపీలు బ‌స్సు యాత్ర‌కు స‌సేమిరా అన్నార‌ట‌. ఇప్పుడు ఈ వార్త చంద్ర‌బాబుకు బాగానే దెబ్బ కొట్టేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా... అస‌లు బాబు చెప్పినట్లుగా బస్సు యాత్ర‌కు టీడీపీ ఎంపీలు ఎందుకు స‌రేన‌న‌లేన్న విష‌యానికి వ‌స్తే... నేటి ఉద‌యం ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌న‌సులో ఉన్న మాట‌ను ఏమాత్రం దాచుకోకుండా నిర్మోహ‌మాటంగా చెప్పేసే మ‌న‌స్త‌త్వ‌మున్న టీడీపీ నేత‌ - అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి... ఇక ఢిల్లీ వ‌దిలి వచ్చేయండ‌ని బాబు ఆదేశాలు ఇచ్చేయ‌గానే నేటి ఉద‌యం ఢిల్లీలో ఫ్టైలెక్కేసి అమ‌రావ‌తిలో ల్యాండైపోయారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన జేసీ... బ‌స్సు యాత్ర‌ను తామెందుకు వ‌ద్దంటున్నామ‌న్న విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అయినా జేసీ ఏం చెప్పార‌న్న విష‌యానికి వ‌స్తే... *నిరసనలన్నీ ఒకే రోజు చేయడం ఏంటి? ఢిల్లీలో చాలా రోజులు ఉండి వచ్చాం. తాము కనీసం ఇంటికి వెళ్లి పెళ్లాం ముఖమైనా చూడవద్దా? అప్పుడే యాత్ర అంటూ బస్సు ఎక్కమంటే ఎలా? కేంద్రం చేస్తున్న అన్యాయంపై ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అతి త్వరలోనే బస్సు యాత్ర ఉంటుంది. కానీ ఎప్పుడో చెప్ప‌లేం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారు. రాజీనామాలు చేస్తే కేంద్రాన్ని ప్రశ్నించే వారు ఎవరు?* అంటూ జేసీ త‌న‌దైన శైలిలో చెప్పుప‌కుంటూ పోయారు. మొత్తంగా నాన్ స్టాప్ ఉద్య‌మాలంటే త‌మ‌తో కాద‌ని జేసీ తేల్చేయ‌డంతో... ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం అలుపెర‌గ‌ని పోరాటం చేస్తామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు త‌లెక్క‌డ పెట్టుకుంటారోన‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు మొద‌ల‌య్యాయి.