Begin typing your search above and press return to search.

నాలుగేళ్లుగా పెళ్లాల ముఖాలే చూస్తున్నారుగా జేసీ!

By:  Tupaki Desk   |   10 April 2018 3:30 PM GMT
నాలుగేళ్లుగా పెళ్లాల ముఖాలే చూస్తున్నారుగా జేసీ!
X
ప్ర‌త్యేక హోదా మీద ఏపీ టీడీపీ నేత‌ల క‌మిట్ మెంట్ ఎంత‌న్న విష‌యాన్ని చెప్పేసే వైనం ఒక‌టి తాజాగా తెర మీద‌కు వ‌చ్చింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో పీకేశాం.. పొడిచేశామంటూ హ‌డావుడి చేసిన తెలుగు త‌మ్ముళ్లు తాజాగా అమ‌రావ‌తికి వ‌చ్చారు.

ఢిల్లీలో చేసేదేమీ లేక‌పోవ‌టం.. ప్ర‌ధాని ఇంటి ముందు చేసిన కొద్దిపాటి హ‌డావుడిని క‌థ‌లు.. క‌థ‌లుగా ఏపీ ప్ర‌జ‌ల‌కు చెప్పేయ‌టం ద్వారా హోదా కోసం చాలా చేస్తున్నామ‌న్న భావ‌న క‌లిగించే ప్ర‌య‌త్నానికి తెర తీస్తున్నారు. హోదాపై త‌మ త‌ర్వాతి ప్ర‌యాణం ఎలా ఉండాల‌న్న విష‌యాన్ని ఎంపీల‌తో చ‌ర్చించేందుకు.. రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు అమ‌రావ‌తికి రావాలంటూ ఎంపీల‌కు సందేశం పంపారు చంద్ర‌బాబు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం త్వ‌ర‌లో ఎంపీల చేత బ‌స్సు యాత్ర‌లు చేయించేందుకు బాబు ప్లాన్ సిద్ధం చేశారు.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తికి వ‌చ్చిన ఎంపీల‌ను ఒక ఛాన‌ల్ ప్ర‌తినిధులు ప‌లుక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తానేం మాట్లాడుతున్న‌న్న విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. మ‌న‌సుకు అనిపించింది చెప్పే జేసీ నోట నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు ఏపీ ప్ర‌జ‌ల‌కు షాకింగ్ గా అనిపించ‌టం ఖాయం. ఢిల్లీ నుంచి వ‌చ్చారు క‌దా.. మీ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ ఏమిట‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఢిల్లీ నుంచి ఇప్పుడే వ‌చ్చాం.. అప్పుడే బ‌స్సు ఎక్క‌మంటే ఎలా?.. పెళ్లాల ముఖాలైనా చూడ‌ద్దా అంటూ ప్ర‌శ్నించారు.

అన్ని నిర‌స‌న‌లు ఒకే రోజు చేయాలా? అన్న ఆయ‌న‌.. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా ప్ర‌జాస్వామ్యాన్ని మోడీ అప‌హాస్యం చేశార‌న్నారు. త‌న‌కున్న విచ‌క్ష‌ణాధికారాల‌తో లోక్ స‌భ స్పీక‌ర్ అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌ప‌వ‌చ్చ‌ని.. ప్ర‌జాస్వామ్యంలో అవిశ్వాస‌మే బ్ర‌హ్మాస్త్రంగా అభివ‌ర్ణించారు. ప్ర‌స్తుతం మోడీ నియంతృత్వం న‌డుస్తోంద‌న్న జేసీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేశారు.

నాలుగేళ్లుగా హోదా విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా... హోదా ప్ర‌స్తావ‌న వ‌చ్చిన వెంట‌నే.. అది రాదంటూ తేల్చిన జేసీ.. ఈ రోజున ఢిల్లీ నుంచి వ‌చ్చాం.. పెళ్లాల ముఖాలైనా చూడొద్దా? అంటూ తీస్తున్న రాగాలు చూస్తే.. త‌మ్ముళ్ల క‌మిట్ మెంట్ ఎంతో అర్థ‌మ‌వుతుంది. ఓప‌క్క ఆరోగ్యాల్ని ప‌ణంగా పెట్టి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తుంటే.. అందుకు భిన్నంగా కులాశాగా మాట్లాడుతున్న జేసీ మాట‌లు చాలు.. టీడీపీ ఎంపీల‌కు హోదా సాధ‌న‌పై వారెంత ప‌ట్టుద‌ల‌గా ఉన్నారో ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పాలి. త‌మ నోటి నుంచి ఈ త‌ర‌హా మాట‌లు వ‌స్తే.. ఏపీ ప్ర‌జ‌లు క్ష‌మించ‌రు.. వారి ఆగ్ర‌హం త‌మ రాజ‌కీయ కెరీర్ కు శాపంగా మారుతుంద‌న్న భ‌యం కూడా లేదా? అన్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.