Begin typing your search above and press return to search.

జేసీకి మైకు ఎందుకు ఇవ్వలేదంటే..

By:  Tupaki Desk   |   7 Aug 2016 6:27 AM GMT
జేసీకి మైకు ఎందుకు ఇవ్వలేదంటే..
X
విభజన దెబ్బకు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన జేసీ దివాకరరెడ్డికి టీడీపీలో పెద్దగా ప్రయారిటీ దక్కడం లేదని ఆయన అనుచరులు బాధపడుతున్నారు. తాజాగా శనివారం సీఎం పర్యటనలో ఆయనకు చేధుఅనుభవం ఎదురైంది. సీఎం సభలో ఓ పది నిమిషాలు మాట్లాడేందుకు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అనంతపురంలో తిరుగులేని నేతగా ఉన్న ఆయన మాట్లాడేందుకు ప్రయత్నించినా అధికారులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులతో పాటు టీడీపీ నేతలు కూడా తనను మాట్లాడనివ్వలేదని స్వయంగా జేసీ కూడా అనుచరుల వద్ద వాపోయారట.

బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమాఖ్య ప్రారంభోత్సవ కార్యక్రమంలో జేసీ మాట్లాడేందుకు ప్రయత్నించగా కలెక్టర్ - ఎమ్మెల్యేలు ఇక చాలించమని వారించారు. దివాకర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే కలెక్టర్‌ కోన శశికుమార్ వెళ్లి ప్రంసంగం చాలించాలని కోరారు. దీంతో ఆయన వైపు జేసీ కోపంగానే చూశారు. కలెక్టర్ వెళ్లి సీట్లో కూర్చుకున్నారు. మరో అర నిమిషంలోనే ఎమ్మెల్యే యామిని బాల వచ్చి అడ్డుపడ్డారు. ప్రసంగం ముగించండి అని కోరారు. దీంతో జేసీ ఆమెపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇంతలోనే మంత్రి పల్లె రఘునాథరెడ్డి వచ్చి జేసీ చెవిలో ఏదో చెప్పి మైక్ తీసుకున్నారు. మొత్తమ్మీద ఇలా జేసీ మైకు పట్టకుని ప్రసంగం మొదలు పెట్టగానే అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఆయన గట్టిగా మూడు నిమిషాలు కూడా సభలో మాట్లాడలేకపోయారు.

అయితే.. జేసీని మాట్లాడకుండా అడ్డుకోవడం వెనుక కారణాలున్నాయని చెబుతున్నారు. జేసీ మాటకారి కావడంతో ఆయన ప్రసంగాలు ప్రజలను అట్రాక్టు చేస్తాయన్న ఉద్దేశంతో ఎవరూ ఆయన్ను ఆపరు. కానీ.. ఇక్కడ మాత్రం పదేపదే అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అందుకు కారణం - ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారన్న భయమే. ప్రత్యేకహోదా అంశంపై ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి పదేపదే మోహమాటం లేకుండా నిజాలు మాట్లాడుతుండడంతో మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న భయంతోనే ఆయనను ప్రసంగించకుండా అడ్డుకున్నారని భావిస్తున్నారు. అనంతపురంలోని కాంగ్రెస్ నేతలు ఇది చూసి జేసేపై జాలిపడుతున్నారట. కాంగ్రెస్‌ లో కింగ్‌ లా బతికిన జేసీ ఇప్పుడు మైక్‌ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేస్తున్నారు.