Begin typing your search above and press return to search.

జేసీ దెబ్బ‌కు బాబుకు ఊపిరాడ‌టం లేద‌ట‌!

By:  Tupaki Desk   |   19 July 2018 5:33 AM GMT
జేసీ దెబ్బ‌కు బాబుకు ఊపిరాడ‌టం లేద‌ట‌!
X
సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తారు ఏపీ టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి. సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా.. మ‌న‌సులో ఉన్న మాట‌ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేందుకు ఏ మాత్రం జంక‌ని తీరు ఆయ‌న సొంతం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ముఖం మీద‌నే.. మీరు.. రివ్యూ మీటింగ్‌లు త‌గ్గిస్తే మంచిది.. అధికారులు మీటింగ్ ల‌తోనే కాలం గ‌డిపేస్తున్నారు.. ప‌ని చేయ‌టం లేద‌న్న సూటిగా మాట‌ను వేలాది మంది ఉన్న స‌భ‌లోనే చెప్పే ద‌మ్ము జేసీ సొంతం.

కొన్ని ఇష్యూల మీద పెద‌వి విప్పాలంటే వంద ర‌కాలుగా ఆలోచించే రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నంగా జేసీ వ్య‌వ‌హ‌రిస్తుంటారు. విష‌యం ఏదైనా స‌రే.. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సుత్తి కొట్ట‌కుండా చెప్పేస్తారు. కొన్నిసార్లు సూటిగా.. మ‌రికొన్నిసార్లు శ్లేష‌తో చెప్పే అల‌వాటున్న జేసీ.. తాజాగా త‌న తీరుతో మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు.

ఏపీకి ఇస్తాన‌న్న ప్ర‌త్యేక హోదా అంశంతోపాటు.. విభ‌జ‌న హామీల అమ‌లు వైఫ‌ల్యంపై మోడీ స‌ర్కారుపై టీడీపీ ఎంపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌టం తెలిసిందే. వాస్త‌వానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టేందుకు అవ‌స‌ర‌మైన బ‌లం టీడీపీకి సొంతంగా లేదు.

అయితే.. మోడీ స‌ర్కారుపై అవిశ్వాసానికి విప‌క్ష నేత‌లు ప‌లువురు సిద్ధంగా ఉండ‌టంతో నాని ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాసాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లుగా చెప్ప‌ట‌మే కాదు.. శుక్ర‌వారం దీనిపై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ పేర్కొన్నారు. ఇంత‌టి కీల‌క సంద‌ర్భంలో తాను త‌ప్ప‌క ఉండాల్సిన జేసీ.. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు వెళ్ల‌కుండా హైద‌రాబాద్‌ లోనే ఉండిపోవ‌టం సంచ‌ల‌నంగా మారింది.

లోక్ స‌భ‌లో త‌మ పార్టీ ఎంపీలు మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో హైద‌రాబాద్‌ లో ఉన్న జేసీ.. ఆ సాయంత్రం (బుధ‌వారం) త‌న సొంత జిల్లా అనంత‌పురానికి వెళ్లిపోయారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తాను ఈ పార్ల‌మెంటు స‌మావేశాల‌కు మొత్తంగా హాజ‌రు కావ‌టం లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓప‌క్క త‌మ పార్టీ మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం పెడితే.. అందులో పాల్గొన‌కుండా ఉండ‌మే కాదు.. చ‌ర్చ స‌మ‌యంలోనూ.. ఓటింగ్ స‌మ‌యంలోనూ స‌భ‌కు వెళ్ల‌న‌ని జేసీ చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఎందుకిలా అంటే.. పార్ల‌మెంటులో మాట్లాడేందుకు స‌మ‌ర్థులైన నాయ‌కులు చాలామందే ఉన్నార‌ని.. అనుభ‌వం ఉన్న‌వారు.. ఇంగ్లిష్ ప్రావీణ్యం ఉన్నోళ్లు మాట్లాడ‌తార‌న్నారు. అవిశ్వాస తీర్మానంపై మాట్లాడటానికి ఇద్ద‌రికో.. ముగ్గురికో అవ‌కాశం వ‌స్తుంద‌న్న ఆయ‌న‌.. త‌న‌కు ఇంగ్లిషు.. హిందీ స‌రిగా రాద‌న్నారు. త‌న‌కు ఎవ‌రి మీదా కోపం లేద‌ని.. చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌న్నా ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేస్తూనే.. తాను పార్ల‌మెంటు స‌మావేశాల‌కు వెళ్ల‌క‌పోవ‌టానికి కార‌ణం బాబుకు తెలుసంటూ కొస‌మెరుపు మాట‌లు మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రమైంది. జేసీ తీరుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఊపిరి ఆడ‌న‌ట్లుగా మారింద‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అనంత‌పురం జిల్లాకు సంబంధించి జేసీ రిక్వెస్ట్ లు కొన్ని బాబు ద‌గ్గ‌ర పెండింగ్ లో ఉన్నాయ‌ని.. ఈ నేప‌థ్యంలో ఆ అంశాల్ని ఒక కొలిక్కి తెచ్చేందుకే అల‌క‌పాన్పు ఎక్కిన‌ట్లుగా అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.