Begin typing your search above and press return to search.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ అస్స‌లు పోటీ చేయ‌ర‌ట‌

By:  Tupaki Desk   |   18 Oct 2016 9:58 AM GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో జేసీ అస్స‌లు పోటీ చేయ‌ర‌ట‌
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు.. వివాదాస్ప‌ద మాట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన తెలుగు నేత‌ల్లో జేసీ దివాక‌ర్‌ రెడ్డి ఒక‌రు. ఆయ‌న కానీ మాట్లాడాల‌నుకుంటే ఎవ‌రిపైనైనా.. ఎంతటి మాట అయినా అనేసే స‌త్తా ఆయ‌న సొంతం. పార్టీ అధినేత మీద సైతం విమ‌ర్శ‌నాత్మ‌కంగా మాట్లాడే స‌త్తా ఆయ‌న సొంతం. ఇక‌.. ప్ర‌త్యేక హోదా లాంటి సున్నిత అంశాల్లో పార్టీ స్టాండ్ ను ప‌క్క‌న పెట్టేసి.. త‌న‌కు అనిపించిన విష‌యాన్ని సూటిగా కుండ బ‌ద్ధ‌లుకొట్టేయ‌టం ఆయ‌న‌కు మామూలే.

అలాంటి జేసీ తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. తాను వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏ స్థానం నుంచి పోటీ చేయ‌న‌ని వెల్ల‌డించారు. పార్ల‌మెంటు.. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా చేతులు ఎత్త‌టం మిన‌హా చేస్తున్న‌ది ఏమీ లేద‌ని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల నుంచి ఏ స్థానం నుంచీ పోటీ చేయ‌న‌ని తేల్చేశారు.

పాకిస్థాన్ చేస్తున్న‌కుట్ర‌ల నేప‌థ్యంలో ఆ దేశంతో యుద్ధ‌మే ప‌రిష్కారంగా అభిప్రాయ‌ప‌డిన జేసీ.. యుద్ధం కార‌ణంగా 20 - 30 కోట్ల మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణించినా పాక్‌ కు బుద్ధి చెప్ప‌టం కోసం యుద్ధం చేయాల‌నే భారీ డైలాగ్‌ ను చెప్పేశారు. గాంధీ.. నెహ్రులు గొప్ప నేత‌లే అయినప్పటికీ జిన్నాతో క‌లిసి దేశ విభ‌జ‌న‌కు కార‌ణ‌మ‌య్యార‌ని.. నాటి నిర్ణ‌యం కార‌ణంగానే నేడు పాకిస్థాన్.. భార‌త్ కు స‌మ‌స్య‌గా మారింద‌ని వ్యాఖ్యానించారు. యుద్ధం అంటే ప‌క్కింటోడితో పోట్లాడినంత సింఫుల్ గా చెప్పేయ‌ట‌మేకాదు.. యుద్ధం కార‌ణంగా 20.. 30 కోట్ల మంది మ‌ర‌ణించినా ఫ‌ర్లేద‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న జేసీని చూస్తే.. ఆయ‌న దృష్టిలో ప్రాణం విలువ మ‌రీ సింఫుల్ అన్న‌ట్లుగా అనిపించ‌ట్లేదు..?