Begin typing your search above and press return to search.

వైరాగ్యంలో జేసీ..ఎన్నికల్లో పోటీ చేయరట!

By:  Tupaki Desk   |   4 March 2020 8:30 PM GMT
వైరాగ్యంలో జేసీ..ఎన్నికల్లో పోటీ చేయరట!
X
టీడీపీ సీనియర్ నేత - అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఓ రేంజిలో ప్రత్యర్థులపై విరుచుకుపడే జేసీ... ఈ సారి మాత్రం వైరాగ్యం నిండిన వదనంతో వచ్చి మీడియా ప్రతినిధులకే షాకిచ్చేశారు. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సొంత నియోజకవర్గం తాడిపత్రి పరిధిలోని మునిసిపాలిటి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్... అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేయబోమంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలన్న నిర్ణయానికి ఎందుకు వచ్చామన్న విషయాన్ని కూడా జేసీ వివరించారు.

టీడీపీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరమణ పలు కేసుల్లో అరెస్టై దాదాపు 60 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన విషయాన్ని తెలుసుకున్న జేసీ... స్వయంగా వెంకటరమణ గ్రామానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం అక్కడ కనిపించిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేసీ... తనలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వైరాగ్యాన్ని బయటపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ తరఫున ఏ ఒక్కరు కూడా పోటీ చేయరని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా... అక్రమ కేసులు పెట్టేసి అనర్హత వేటు వేసేందుకు జగన్ సర్కారు సిద్ధంగా ఉందన్న జేసీ... అలా వేటు వేయించుకోవడానికి బదులుగా పోటీకే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా జేసీ చెప్పుకొచ్చారు.

పార్టీని, తమను అంటిపెట్టుకుని ఉన్న వారిని రక్షించుకునేందుకే ఇంతటి కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా జేసీ చెప్పారు. ఎన్నికల బరిలోకి దిగితే... లక్షలాది రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తుందని, అంత ఖర్చు పెట్టి గెలిచినా.... ఎన్నికల్లో డబ్బు పంచారనో, మద్యం పంచారనో అక్రమ కేసులు బనాయించేసి కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో తమ వారందరినీ బుక్ చేసే పనిని వైసీపీ సర్కారు మొదలెట్టేసిందని జేసీ చెప్పారు. ‘‘ఇలా డబ్బు ఖర్చు పెట్టి గెలవడమెందుకు? కేసులు పెట్టించుకోవడం ఎందుకు? జైలుకెళ్లడం ఎందుకు?.. మొత్తంగా ఎన్నికలకే దూరంగా ఉంటే సరిపోతుంది కదా. ఎన్నికలకు దూరంగా ఉంటే సుఖంగా ఉండొచ్చు కదా. అనవసరంగా ఎన్నికల బరిలోకి దిగి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకు?’’ అని జేసీ చెప్పుకొచ్చారు.