Begin typing your search above and press return to search.

మొత్తంగా మీరేం చెబుతారు జేసీ?

By:  Tupaki Desk   |   2 March 2018 7:05 AM GMT
మొత్తంగా మీరేం చెబుతారు జేసీ?
X
తెలుగు ప్ర‌జ‌ల‌కు జేసీ దివాక‌ర్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న మాట‌లు ఎలా ఉంటాయో వివ‌రించాల్సిన ప‌ని ఉండ‌దు. ఆయ‌నంతా ఓపెన్ గా ఉన్న‌ట్లు ఉంటారు. మ‌న‌సులో ఏమీ దాచుకోకుండా మాట్లాడిన‌ట్లు క‌నిపిస్తారు. కానీ.. అందువ‌ల్ల రాష్ట్రానికి పైసా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

జేసీ మాట‌లు ఎప్పుడూ చూసినా నిరాశావాదం పొంగిపొర్లుతా ఉంటుంది. ఏదైనా చేద్దామంటే.. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి? ప్ర‌యోజ‌నం ఏమిటి? ఇలా చెబుతూనే ఉంటారు కానీ.. హ‌క్కుల కోసం కోట్లాడి తెచ్చుకుందామ‌న్న మాట అస్స‌లు వినిపించ‌దు.

ఎప్ప‌టిక‌ప్పుడు రాజీ ప‌డాల‌న్న‌ట్లుగా ప‌రోక్షంగా వెన‌క్కి త‌గ్గించే మాట‌లు చెబుతుంటారు. ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఉంటుంద‌న్న ప్రాధమిక సూత్రాన్ని ప‌క్క‌న పెట్టేసి.. నిత్యం స‌మ‌స్య‌ల్ని మాత్ర‌మే ఆయ‌న ప్రస్తావిస్తుంటారు. అంతేనా.. మ‌నమేం చేయ‌లేం అంటూ నిరాశ స్వ‌రంతో మాట్లాడ‌తారు. జేసీ మాట‌లు వింటే.. పోరాడాల‌నుకున్న వారు సైతం.. ఎందుకులే అని ఇష్యూను ప‌క్క‌న ప‌డేసేలా ఆయ‌న తీరు ఉంటుంది.

ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న అంశంపై పోరాడి సాధించాల‌న్న స‌గ‌టు ఆంధ్రోళ్ల తీరుకు భిన్నంగా ఆయ‌న ఎప్పుడో ఆశ‌లు వ‌దిలేసుకున్నారు. ఏం చేసినా హోదా సాధ్యం కాద‌న్న‌ట్లు మాట్లాడ‌తారు. అలాంటి ఆయ‌న ఈసారి బాబు స‌హ‌నాన్ని కేంద్రం ప‌రీక్షిస్తుందంటూ వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చినా ఏదో భిక్షం వేసిన‌ట్లుగా ఇస్తారే త‌ప్పించి అందువ‌ల్ల ఒరిగేదేమీ ఉండ‌ద‌న్నారు.

ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు పెద్ద‌దిక్కుగా మారి.. ఆయ‌న‌కు ఆయ‌న చొర‌వ తీసుకొని ప్ర‌యత్నిస్తే కాస్త ఫ‌లితం ఉండొచ్చ‌న్నారు. టీడీపీ ఎంపీలు ప‌లువురు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాతో స‌మావేశ‌మైన నేప‌థ్యంలో.. ఆ చ‌ర్చ‌ల సారాంశాన్ని బాబుకు వివ‌రించేందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో జేసీ మీడియాతో మాట్లాడారు.

ఏప్రిల్ లో రాజీనామాలు చేయ‌టం వ‌ల్ల ఉప ఎన్నిక‌లు రావ‌ని ఆయ‌న చెప్పారు. జేసీ మాట‌ల్ని ఒక్క మాట‌ల‌తో తేలిస్తే.. ఏం చేసినా హోదా రాదు.. వ‌స్తే గిస్తే.. వెంక‌య్య‌నాయుడు సీన్లోకి వ‌చ్చి పెద్ద‌రికం చేస్తే ఏదైనా ఛాన్స్ ఉండొచ్చ‌న్న మా ట‌ను జేసీ చెప్పారు. అయినా.. మోడీ అండ్ కోల‌కు ఇష్టం లేనిది.. ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లిగించే అంశంపై వెంక‌య్య గ‌ళం విప్పుతారా? అన్న ప్రాక్టిక‌ల్ ప్ర‌శ్న వేసుకుంటే జేసీ మాట‌ల్లో ఏపీ ప్ర‌జ‌ల‌కు ప‌నికి వ‌చ్చేది ఎంతో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.