Begin typing your search above and press return to search.

క్లారిటీ వ‌చ్చింది- జ‌న‌సేన‌దీ పాత రాజ‌కీయ‌మే!

By:  Tupaki Desk   |   9 April 2018 5:57 PM GMT
క్లారిటీ వ‌చ్చింది- జ‌న‌సేన‌దీ పాత రాజ‌కీయ‌మే!
X
కొత్త నాయకుడు వ‌చ్చాడు. స‌మాజం అన్నాడు. శ్రేయ‌స్సు అన్నాడు. దేశ భ‌క్తి అంటున్నాడు. ఇప్ప‌టికే భారీ అభిమాన వ‌ర్గం ఉన్న ఆ నాయ‌కుడి ఆవేశం చూసి కొంద‌రు అభిమాన వ‌ర్గం... ఆయ‌న‌ను *ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ల‌ను మార్చే మార్గ‌ద‌ర్శ‌కుడు* అనుకున్నారు. అనుకోవ‌డ‌మే కాదు, జ‌నానికి చెప్ప‌డం మొద‌లుపెట్టారు. కానీ... పుట్టిన కొన్ని నెల‌ల‌కే ఒక పార్టీకి ప్ర‌త్య‌క్ష మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఒక ముసుగు తొల‌గింది. పార్టీ నిర్మాణం జ‌ర‌గ‌లేదు, డ‌బ్బు లేదు... కాబ‌ట్టి, రాష్ట్ర భ‌విష్య‌త్తు కోసం ఓట్లు చీల్చ‌ద‌లుచుకోలేదంటే కొంద‌రు న‌మ్మారు. కానీ... ఎప్ప‌టిక‌పుడు అత‌ని ప్ర‌వ‌ర్త‌న అత‌ని ముసుగులు తొల‌గిస్తూ వ‌చ్చింది. ఆయ‌నెవ‌రో ఇప్ప‌టికే అర్థ‌మై ఉంటుంది మీకు... జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

మాకు ఎంత బ‌లం ఉంటే అన్నే చోట్ల పోరాటం చేస్తాం, అధికారం మా ఉద్దేశం కాదు... ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌శ్నించ‌డానికి మాత్ర‌మే అని చెప్పిన జ‌న‌సేన అధ్య‌క్షుడు త‌న చివ‌రి ముసుగు కూడా తొల‌గించేశాడు. తాను కూడా అంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్లాంటి వారే అని నిరూపించేశారు. ఇటీవ‌లే ఒక కాంగ్రెస్ నేత‌ను పార్టీలో చేర్చుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్, తాజాగా గ‌తంలో ప‌లుకేసులు ఎదుర్కొని సుదీర్ఘ కాలం తాను పంచెలూడ‌దీస్తాన‌ని చెప్పిన పార్టీ లో ఉండి గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశంలోకి వ‌చ్చిన జేసీ దివాక‌ర్‌ రెడ్డిని జ‌న‌సేన‌లోకి ర‌మ్మ‌ని పిలుపు పంపార‌ట‌. ఇది గాసిప్ ఎంత‌మాత్ర‌మూ కాదు, స్వ‌యంగా ఆ పిలుపు అందుకున్న జేసీయే స్వ‌యంగా మీడియాతో చెప్పారు.

*జనసేన అధినేత పవన్ కల్యాణ్ తరపున కొందరు దూతలు న‌న్ను కలిశారు. టీడీపీ వ‌దిలి జ‌న‌సేన‌లోకి మారమని ఆఫర్ ఇచ్చారు* అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. అయితే త‌న‌కు పార్టీ మారే ఉద్దేశం లేద‌ని, అందుకే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని జేసీ స్ప‌ష్టంచేశారు. అంతేకాదు, *వచ్చే ఎన్నికల్లో జనసేన గల్లంతవడం ఖాయం* అని జోస్యం చెప్పారు.

ఇదిలా ఉంటే... జ‌న‌సేన కూడా సంప్ర‌దాయ పార్టీల‌తో పాటు, పీఆర్పీ లాగే ఇత‌ర నేత‌ల‌పై ఆధార‌ప‌డాల‌ని డిసైడ్ అయిపోయిందని అర్థ‌మ‌వుతోంది. కొత్త అభ్య‌ర్థులు పెద్ద‌గా ఆ పార్టీ ప‌ట్ల ఆక‌ర్షితులు కాక‌పోవ‌డం వ‌ల్ల‌నో, లేక సీనియర్ల లేక‌పోతే పార్టీ న‌డ‌ప‌లేం అన్న అభిప్రాయానికి రావ‌డం వ‌ల్ల‌నో జ‌న‌సేన పార్టీ ఆప‌రేష‌న్ ఆక‌ర్షని న‌మ్ముకున్న‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి జంపింగ్ రాజ‌కీయం చేస్తే జేసీ చెప్పిన‌ట్లు పీఆర్పీ లాగానే జ‌న‌సేన‌కు భ‌విష్య‌త్తు నిరాశాజ‌న‌క‌మే అయ్యే ప్ర‌మాదం లేక‌పోలేదు.