Begin typing your search above and press return to search.

బాబుకు జేసీ ఇస్తున్న సందేశం ఏంటి?

By:  Tupaki Desk   |   23 Oct 2018 5:20 AM GMT
బాబుకు జేసీ ఇస్తున్న సందేశం ఏంటి?
X
మీలో ఏదైనా లోపం ఉంద‌నుకుందాం. ఆ లోపాన్ని మీ స‌న్నిహితుడైన మిత్రుడు గుర్తించార‌నుకుందాం. ఏం చేస్తారు? మిమ్మ‌ల్ని వ్య‌క్తిగ‌తంగా క‌లిసి..మీలోని లోపాన్ని ఎత్తి చూప‌టం.. దాని కార‌ణంగా జ‌రుగుతున్న న‌ష్టాన్ని వివ‌రించ‌టం.. ఏదైనా స‌ల‌హాలు ఇవ్వ‌టం లాంటివి చేస్తారు. అంతేకానీ.. మీ మిత్రుల వ‌ద్ద‌కు.. మీ బంధువుల వ‌ద్ద‌కు.. మీ కుటుంబ స‌భ్యుల వ‌ద్ద‌కు వెళ్లి.. మీలోని లోపాల్ని ఎత్తి చూపిస్తూ వ్యాఖ్య‌లు చేస్తారా? ఆ ఛాన్స్ ఉంటుందా? అన్న ప్ర‌శ్న వేస్తే.. మీ స‌మాధానం క‌చ్ఛితంగా లేద‌నే మాటే చెబుతారు.

మ‌రి.. ఈ చిన్న విష‌యం టీడీపీ నేత‌.. సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన జేసీ దివాక‌ర్ రెడ్డికి తెలీదా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. చిన్న చిన్న విష‌యాల్ని సైతం చెప్పించుకునే అల‌వాటు జేసీకి లేదు. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌న‌కు చెప్ప‌టం కాదు.. ఆయ‌నే న‌లుగురికి చెప్పే ర‌కం. అలాంటి ఆయ‌న తాను మాట్లాడే మాట‌లు ఎందుకు? ఏమిటి? అన్న దానిపై ఆయ‌న‌కు పిచ్చ క్లారిటీ ఉంటుంది.

తాజాగా జేసీ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల్లో కీల‌క‌మైన‌ది.. బాబు ఎమ్మెల్యేల్లో 40 శాతం మందిపై ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన అసంతృప్తి ఉంద‌ని. జేసీ లాంటి మ‌నిషే.. 40 శాతం అంటే.. వాస్త‌వంలో అంత‌కు మించి ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. ఆ నిజాన్ని చెబితే లేనిపోని గంద‌ర‌గోళం చోటు చేసుకుంటుంద‌న్న విష‌యం తెలీని చిన్న పిల్లాడేమీ కాదు జేసీ.

మిగిలిన నేత‌ల‌కు భిన్నంగా.. త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను అధినేత కంటే కూడా మీడియాతోనే ఎక్కువ‌గా పంచుకుంటార‌న్న విమ‌ర్శ ఉన్న జేసీ తీరు కాస్త భిన్న‌మే. కానీ.. అదేమీ అమాయ‌క‌త్వంతో కాదు.. అన్ని ఆయ‌న అనుకున్న‌ట్లే ఉంటాయ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. జేసీ వైఖ‌రిని జాగ్ర‌త్త‌గా క‌నిపిస్తే ఒక ల‌క్ష‌ణం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ఆయ‌న గిల్లే ర‌కమే కానీ.. ర‌చ్చ చేసే ర‌కం కాదు.

తానున్న పార్టీతో పాటు.. ప‌క్క‌నున్న పార్టీల పైనా ఆయ‌న అదే తీరును ప్ర‌ద‌ర్శిస్తుంటారు. తన మాట‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని.. త‌న అవ‌స‌రాల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న తీర్చాల‌న్న ధోర‌ణి జేసీలో ఎక్కువే. ఆయ‌న గురించి బాగా తెలిసిన స‌న్నిహితులు కొంద‌రైతే.. ఆయ‌న‌కు ఏ అవ‌స‌రం వ‌చ్చినా.. త‌న ప‌ని ఏది పూర్తి కాకున్నా ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చి.. తాను చెప్పాల్సిన మాట‌ల్ని చెప్పేసి ఒత్తిడిని పెంచేసే ప‌ని చేప‌డ‌తార‌ని చెబుతారు.

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో జేసీ తీరు పూర్తిగా భిన్న‌మైన‌ది. రిక్వెస్ట్ చేసి ప‌ని చేయించుకోవ‌టం కంటే.. క‌మాండ్ చేసి ప‌ని పూర్తి చేసుకోవ‌టం జేసీకి మొద‌ట్నించి అల‌వాటు. ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా త‌న మార్క్ ను వ‌దులుకోవ‌టానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు.

అయ‌న ఏమైనా కాస్త త‌గ్గారంటే అది కేవ‌లం దివంగ‌త మ‌హా నేత వైఎస్ హ‌యాంలోనే. ఇప్పుడింత ఓపెన్ గా మాట్లాడుతున్న జేసీ.. వైఎస్ ముఖ్య‌మంత్రిగా ఉన్న కాలంలో ఆచితూచి అన్న‌ట్లుగా మాట్లాడేవారు. త‌న ప‌నులు ముందుకు క‌ద‌ల‌క‌పోయినా.. ఆయ‌న తొంద‌ర‌ప‌డే వారు కాదు. అయితే.. వైఎస్ కున్న‌ప‌ట్టు చంద్ర‌బాబులో అస్స‌లు క‌నిపించ‌దు. బాబును ఏమ‌న్నా.. కొంప‌లు మునిగిపోవ‌న్న మాట ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల్లో క‌నిపిస్తూ ఉంటుంది. ఇదే అలుసుగా తీసుకొని బాబును జేసీ ఒక ఆట ఆడుకుంటార‌ని చెబుతారు. ఇక‌.. తాజాగా జేసీ చేసిన వ్యాఖ్య‌ల మ‌ర్మం ఏమిట‌న్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడున్న సిట్టింగుల మీద భారీ వ్య‌తిరేక‌త ఉంద‌న్న మాట‌ను బ‌లంగా తీసుకుపోవ‌టం ద్వారా.. అనంత‌పురం జిల్లాలో త‌న‌కు అనుకూల‌మైన నేత‌ల‌కు టికెట్లు ద‌క్కేలా ఒత్తిడి తీసుకురావ‌టం జేసీ ల‌క్ష్యంగా చెబుతున్నారు. త‌న ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న కొత్త త‌రం నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వ‌టంతో పాటు.. అనంత జిల్లా రాజ‌కీయం త‌న గుప్పిట్లో ఉండాల‌న్న ఆశ‌తో పాటు.. గ్రౌండ్ లెవెల్లో పార్టీకి ఉన్న వాస్త‌వ ప‌రిస్థితిని చెప్ప‌ట‌మే ల‌క్ష్యంగా చెబుతున్నారు.

బాబు లాంటి అధినేత వ‌ద్ద‌కు వెళ్లి.. గుట్టుగా త‌న మ‌న‌సులోని కోరిక‌ను.. గ్రౌండ్ లెవ‌ల్లో తాను తెలుసుకున్న వాస్త‌వాల్ని చెబితే అంత‌గా చెవికెక్కించుకోర‌న్న విష‌యం జేసీకి తెలియంది కాదు. అందుకే.. గుట్టును గ‌ట్టున వ‌దిలేసి.. మీడియా ముందు మాట్లాడ‌టం ద్వారా అధినేత‌కు చురుక్కుమ‌నేలా చేయ‌ట‌మే జేసీ ల‌క్ష్య‌మ‌న్న మాట వినిపిస్తోంది.