Begin typing your search above and press return to search.

జేసీ.. ఈ ఎత్తుడు, దించుడేందీ?

By:  Tupaki Desk   |   9 Jan 2018 6:58 AM GMT
జేసీ.. ఈ ఎత్తుడు, దించుడేందీ?
X
మొన్న‌టిదాకా కాంగ్రెస్‌ లో కొన‌సాగి... గ‌డ‌చిన ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా హ‌స్తం పార్టీకి ఝ‌ల‌క్కిచ్చి టీడీపీలో చేరిపోయిన అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి... నిజంగా ఏం చేసినా సంచ‌ల‌నంగానే ఉంటుంద‌ని చెప్పాలి. ఎందుకంటే... నోరు తెరిస్తే ఏది అనిపిస్తే అది మాట్లాడేయ‌డమే తెలిసిన జేసీ... అవ‌త‌లి వారికి త‌న వ్యాఖ్య‌ల కార‌ణంగా ఎంత మేర డ్యామేజీ జ‌రుగుతుంద‌న్న విష‌యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోరు. పార్ల‌మెంటులోని దిగువ స‌భ లోక్‌ స‌భ‌లో ఓ స‌భ్యుడిగా... అనంత‌పురం పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గ ప్ర‌తినిధిగా జేసీ చాలా పెద్ద ప‌ద‌విలో ఉన్న‌ట్లే లెక్క‌. ఏడాదికి ఏకంగా రూ.5 కోట్ల మేర ఎంపీల్యాడ్స్ తో పాటు కేంద్రంతో పోరాడి త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి ఎంత‌గానో కృషి చేసే వెసులుబాటు ఆయ‌న‌కు ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేనా... అధికార పార్టీకి చెందిన ఎంపీగా... ఏపీ స‌ర్కారు నుంచి కూడా పెద్ద ఎత్తున నిధుల‌ను మంజూరు చేయించుకునే వెసులుబాటు కూడా ఆయ‌న‌కు ఉంద‌నే చెప్పాలి. మ‌రి ఇవన్నీ మ‌రిచిపోతున్న జేసీ దివాక‌ర్ రెడ్డి... నిత్యం ఏదో అదాటుగా నోటికి అందిన మాట‌లు చెప్ప‌డం మిన‌హా అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గానికి పెద్ద‌గా ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌న్న వాద‌నే వినిపిస్తోంది. సొంత పార్టీ నేత - అనంత‌పురం ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి వ‌ర్గాన్ని అడిగితే ఈ విష‌యం ఇట్టే తేలిపోక మాన‌దు. అస‌లు జేసీ ఏనాడైనా నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించి గానీ - జిల్లా అభివృద్ధి గురించి గానీ ఏనాడైనా ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రిచారా? అన్న కోణంలో టీడీపీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్న సంద‌ర్భాలు లేక‌పోలేదు.

అయినా ఇప్పుడు జేసీ గురించి ఇంత పెద్ద చిట్టా ఎందుకంటే... కేంద్ర బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న ఇప్ప‌టికే ప్రారంభ‌మైపోయింది క‌దా. స‌ద‌రు బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై అధికార యంత్రాంగం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతోంది. ఈ క్ర‌మంలో రైల్వే ప్రాజెక్టు - పెండింగ్ ప్రాజెక్టులు - కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌పై ఏపీకి చెందిన ఎంపీల‌తో రైల్వే శాఖ అధికారులు భేటీ అయ్యారు. న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి వేదిక‌గా కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైన ఈ భేటీకి అనంత‌పురం ఎంపీ హోదాలో జేసీ దివాక‌ర్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. గ‌త బ‌డ్జెట్ సంద‌ర్భంగా తాము ప్ర‌తిపాదించిన ప్రాజెక్టులు - గ‌త బ‌డ్జెట్‌ లో రాష్ట్రానికి - ప్ర‌త్యేకించి త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు కేటాయించిన ప్రాజెక్టులు ఏమ‌య్యాయంటూ ఎంపీలంతా రైల్వే అధికారుల‌ను ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా వ్య‌వ‌హారంపై అంత‌గా దృష్టి పెట్టిన‌ట్టుగా క‌నిపించ‌ని జేసీ... స‌మావేశానికి ముందే మీడియాతో మాట్లాడేందుకు చాలా ఉత్సాహం చూపారు. చానెళ్ల మైకులు చూడ‌గానే ఉత్సాహంగా ముందుకు వ‌చ్చిన జేసీ... అస‌లు ఎంపీలంటే కూర‌లో క‌రివేపాకుల మాదిరిగా ప‌రిస్థితి త‌యారైంద‌ని వ్యాఖ్యానించారు. అయినా ఎంపీల‌ను ప‌ట్టించుకునే వారు ఎవ‌రున్నార‌ని కూడా ఆయ‌న త‌న‌దైన శైలిలో చెప్పుకుపోయారు.

అయినా తాము ప్ర‌తిపాదిస్తే మాత్రం అధికారులు పాటిస్తారా? ఏమిటి? అన్న‌ట్లుగా మాట్లాడిన జేసీ... ప్ర‌ధాని సంత‌కం లేనిదే చిన్న ప‌ని కూడా కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా అధికార కూట‌మిలోని పార్టీకి చెందిన ఎంపీలుగా త‌మ ప‌రిస్థితి ఇప్పుడు మ‌రింత ద‌య‌నీయంగా మారింద‌ని ఆయ‌న ఆక్రోశం వెళ్ల‌గ‌క్కారు. ప్ర‌ధాని చేతులు ఎత్త‌మంటే ఎత్త‌డం - దించ‌మంటే దించ‌డం మిన‌హా తామేమీ చేయ‌లేని స్థితిలో ఉన్నామ‌ని కూడా చెప్పారు. ఇక ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల్లో ప్ర‌ధాన‌మైన ప్ర‌త్యేక హోదా - ప్ర‌త్యేక రైల్వే జోన్ సాధ‌న‌లో తాము చేయ‌గ‌లిగిందేమీ లేద‌ని ఆయ‌న మీడియా ప్ర‌శ్న‌ల కంటే ముందుగానే చేతులు ఎత్తేశారు. అస‌లు ఎంపీ ప‌ద‌వి అంటే ప‌నికి రాని ప‌ద‌విగా మారిపోయింద‌ని కూడా జేసీ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఎంపీలుగా తాము ఏమీ సాధించ‌లేని స్థితిలో ఉన్నామ‌ని - త‌మ‌ను ఏ విష‌యంలోనూ త‌ప్పు బ‌ట్టాల్సిన ప‌ని లేద‌ని జేసీ చెప్పిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.