Begin typing your search above and press return to search.

దళితులపై జేసీ దారుణ పదజాలం

By:  Tupaki Desk   |   3 Jun 2018 12:57 PM GMT
దళితులపై జేసీ దారుణ పదజాలం
X
తన, పరా బేధం లేకుండా అందరినీ తిట్టే జేసీ దివాకర్ రెడ్డి తాజాగా మరోసారి చిక్కుల్లో పడ్డారు. మొన్నటి మహానాడు వేదికపైనుంచి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే.. జేసీ వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురంలో వైసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించారు. వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నా ఓబులేసు ఆధ్వర్యంలో జేసీ దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు యత్నించారు. దీనిపై ఫైర్ అయిన జేసీ ఈ సారి దళితులపై వాడరాని పదాన్ని వాడి పెనుదుమారం లేపారు.

జేసీ అనంతపురంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘నా శవయాత్ర చేశారు.. అంతమంది కొడుకులు నాకున్నారని తెలీదు.. శవాన్ని తీసుకెళ్లి ఊరేగింపు నిర్వహించి దహనం చేసేది ఆ కొడుకులే.. ఈ జిల్లాలో నాకు ఇంతమంది కొడుకులా.? ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు’ అని తీవ్ర పదజాలం వాడారు. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

జేసీ వ్యాఖ్యలపై దళిత నాయకులు భగ్గుమన్నారు. ఆయన దిష్టిబొమ్మ తగులబెడితే మమ్మల్ని నా కొడుకులు అని మాట్లాడుతారా అని మండిపడ్డారు. మొత్తం దళిత జాతిని కించపరిచాడని.. మొన్న మహానాడులో ఎరుకుల కులస్థులను.. నేడు దళితుల్ని అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడు జగన్ సభ్యత, సంస్కారం నేర్పారని.. జేసీ నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే దళిత జాతి సత్తా ఏమిటో చూపిస్తామని దళిత నాయకులు జేసీని హెచ్చరించారు.