Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ వైపు.. జేసీల చూపు.. ఇంతగా స‌హ‌క‌రిస్తార‌నుకోలేదా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 12:30 AM GMT
జ‌గ‌న్ వైపు..   జేసీల చూపు.. ఇంతగా స‌హ‌క‌రిస్తార‌నుకోలేదా?
X
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. నిన్న‌టి శ‌త్రువు.. నేడు మిత్రుడు కావొచ్చు.. నేటి మిత్రుడు.. రేప‌టికి శ‌త్రువు కావొచ్చు! రాజ‌కీ యాల్లో ఏదైనా సాధ్య‌మే. ఇప్పుడు ఇలాంటి ఘ‌ట‌నే ఏపీ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రి.. సొంత పార్టీ నేత‌ల‌నే విస్మ‌యానికి గురి చేస్తోంది. దీనికి కార‌ణం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉప్పు-నిప్పుగా ఉన్న అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్ విష‌యంలో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. సంపూర్ణంగా స‌హ‌క‌రించ‌డ‌మే! ఇది ఒకింత ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. స్థానికంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. నిజ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

విష‌యంలోకి వెళ్తే.. అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ దివాక‌ర్‌రెడ్డి, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిలు.. ఎప్పుడు అవ‌కాశం వ‌చ్చినా.. సీఎం జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. అప్ప‌టి తాడిప‌త్రి ఎమ్మెల్యేగా ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్‌.. త‌న‌పై జ‌గ‌న్ సొంత మీడియా త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిందంటూ.. సాక్షి ఆఫీస్ ఎదుట నిర‌స‌న వ్య‌క్తం చేసి.. `నా..కొ..కు` అంటూ.. జ‌గ‌న్‌ను దుర్భాష‌లాడిన విష‌యం ఇప్ప‌టికీ.. జిల్లా వాసుల‌కు గుర్తే. అదేస‌మ‌యంలో దివాక‌ర్‌రెడ్డి కూడా.. వైసీపీపై నిప్పులు చెరిగేవారు. ``ఆయ‌నది జైలు పార్టీ`` అంటూ.. ఎక్క‌డ అవ‌కాశం చిక్కినా.. ఎద్దేవా చేసేవారు.

ఇక‌,వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు అస్మిత్ రెడ్డిల‌పై కేసులు న‌మోదు కావ‌డం.. కొన్ని రోజులు జైల్లో ఉండ‌డం జేసీ కుటుంబానికి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మ‌ద్య మ‌రింత‌గా నిప్పులు రాజేశాయి. అంతేకాదు.. తాడిప‌త్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏకంగా ప్ర‌భాక‌ర్ ఇంటికి వెళ్లి హ‌ల్చ‌ల్ చేయ‌డం.. దీనిపై పోలీసులు ప్ర‌భాక‌ర్‌పైనే ఎదురు కేసు న‌మోదు చేయ‌డం.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీశాయి. ఇలాంటి నేప‌థ్యంలో అనూహ్యంగా జ‌గ‌న్ వైఖ‌రి మార్చుకున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సంపూర్ణంగా జేసీ కుటుంబానికి జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తున్నార‌ని అంటున్నారు.

గ‌త మార్చిలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల నుంచి జ‌గ‌న్ జేసీ వ‌ర్గానికి చేరువ అవుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో.. జేసీ వ‌ర్గానికి మ‌ద్దతుగా వ్య‌వ‌హ‌రించారనే టాక్ ఉంది. ఎందుకంటే.. తాడిప‌త్రి మునిసిపాలిటీలో జేసీ వ‌ర్గం అంటే.. టీడీపీ మెజారిటీ మేర‌కే స్థానాలు గెలుచుకుంది. దీంతో ఇక్క‌డ ఓ న‌లుగురు కౌన్సిల‌ర్ అభ్య‌ర్థుల‌ను టీడీపీ నుంచి లాగేస్తే..వైసీపీనే మునిసిపాలిటీని ద‌క్కించుకుంటుంద‌ని భావించిన‌ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యూహం సిద్ధం చేసుకున్నారు. అయితే.. జ‌గ‌న్ దీనికి అడ్డుప‌డి.. రాత్రికి రాత్రి వ్యూహం మార్చేశారు.

టీడీపీలోనే ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.. చైర్మ‌న్ అయ్యేలా తెర‌చాటు మంత్రాంగం చేశారు. ఈ విష‌యాన్ని ప్ర‌భాక‌ర్ రెడ్డి కూడా ఒప్పుకొన్నారు. జ‌గ‌న్ స‌హ‌క‌రించ‌క‌పోతే.. తాను చైర్మ‌న్ అయ్యేవాడిని కాద‌ని, జ‌గ‌న్ చ‌ల‌వ‌తోనే మునిసిపాలిటీ త‌మ‌కు ద‌క్కింద‌ని వ్యాఖ్యానించారు. ఇక, వైఎస్ చైర్మ‌న్ ఎన్నిక విష‌యంలోనూ.. వైసీపీ కొంత మేర‌కు దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. ఈ ప‌ద‌విని ద‌క్కించుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. కానీ.. ఈ విష‌యంలోనూ.. జ‌గ‌న్ అంద‌రినీ సైలెంట్ చేశారు. దీంతో జేసీ వ‌ర్గానికే చెందిన మైనార్టీ అభ్య‌ర్థి అబ్దుల్‌.. వైస్ చైర్మ‌న్ అయ్యారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జేసీ వ‌ర్గాన్ని.. జ‌గ‌న్ మ‌చ్చిక చేసుకుంటున్నారా? తాడిప‌త్రి, అనంత‌పురం పార్ల‌మెంటులో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉన్న జేసీల‌ను త‌న వైపు తిప్పుకొనే వ్యూహం వేస్తున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది. పైగా.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూకుడుకు.. జ‌గ‌న్ ప‌రోక్షంగా క‌ళ్లెం వేస్తున్నార‌ని అంటున్నారు. అయితే.. జ‌గ‌న్ వ్యూహాన్ని మౌనంగా గ‌మ‌నిస్తున్న జేసీ వ‌ర్గం.. ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇదిలావుంటే, 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా జేసీ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు జ‌గ‌న్‌. ముఖ్యంగా దివాక‌ర్ రెడ్డి త‌న‌యుడు ప‌వ‌న్‌కుమార్‌కు అనంత‌పురం ఎంపీ టికెట్ ఇస్తామ‌ని కూడా ఆఫ‌ర్ ఇచ్చార‌ని.. ప్ర‌చారం జ‌రిగింది.

అయితే.. అప్ప‌ట్లో ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. జేసీ వ‌ర్గం సైలెంట్ అయింది. ఇక‌, ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అటు జేసీ వ‌ర్గం కూడా జ‌గ‌న్‌పై దూకుడు త‌గ్గించి, కేవ‌లం అధికారుల‌ను మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం లేదంటే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని మాత్ర‌మే టార్గెట్ చేస్తున్నారు త‌ప్ప‌.. జ‌గ‌న్‌పై ఒక్క‌మాట కూడా అన‌డం లేదు. ఈ ప‌రిణామాలను గ‌మ‌నిస్తున్న‌వారు.. జ‌గ‌న్‌-జేసీలు త్వ‌ర‌లోనే క‌ల‌వ‌నున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిణామాలు మార‌తాయ‌ని చెబుతున్నారు. మ‌రి రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు క‌నుక‌.. ఏదైనా జ‌ర‌గొచ్చు!!