Begin typing your search above and press return to search.

తీరు మార‌ని జేసీ ఫ్యామిలీ.. ప‌వ‌న్ అరెస్టు!

By:  Tupaki Desk   |   25 Nov 2020 2:30 AM GMT
తీరు మార‌ని జేసీ ఫ్యామిలీ.. ప‌వ‌న్ అరెస్టు!
X
ఒక పాఠం ఎవ‌రికైనా గుణ‌పాఠం కావాలి. అది రాజ‌కీయాలైనా.. ఇత‌ర రంగాలైనా.. ఒక ఎదురు దెబ్బ నుంచి అనేక పాఠాలు నేర్చుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అలా నేర్చుకుని ముందుకు సాగాలి కూడా. లేక పోతే.. చ‌రిత్ర‌లో క‌లిసిపోయిన నాయ‌కులు, పార్టీలు కూడా ఉన్నాయి. కానీ, ఎన్ని ఎదురు దెబ్బ‌లు తిన్నా.. త‌మ తీరు త‌మ‌దే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.. అనంత‌పురం జిల్లాకు చెందిన సుదీర్ఘ రాజ‌కీయ కుటుంబం జేసీ దివాక‌ర్ రెడ్డి ఫ్యామిలీ. దాదాపు 40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయాల్లో ఉన్న జేసీ కుటుంబానికి గ‌త ఏడాది పెను దెబ్బ త‌గిలింది. దివాక‌ర్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్‌రెడ్డి కుమారులు ప‌వ‌న్‌, అస్మిత్ రెడ్డిలు.. గ‌త ఏడాది అనంత‌పురం ఎంపీగా, తాడిప‌త్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

వాస్త‌వానికి ఈ కుటుంబం నుంచి తొలిసారి రంగ ప్ర‌వేశం చేసిన ప‌వ‌న్‌, అస్మిత్‌ల‌పై చాలానే ఆశ‌లు ఉన్నాయి. ప్ర‌జ‌ల్లో హోప్స్ కూడా ఉన్నాయి. అయితే.. వారిద్ద‌రూ గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా ఏం చేయాలి. ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేలా వ్య‌వ‌హ‌రించాలి. కానీ, వారు అలా చేయ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ దూకుడు రాజ‌కీయాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవ‌రాక్ష‌న్‌తో ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. తాజాగా..దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు.. టీడీపీ నేత‌, ప‌వ‌న్ కుమార్‌రెడ్డి.. ఒక‌వైపు క‌రోనా ఉన్న‌ప్ప‌టికీ.. నిబంధ‌న‌ల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ.. ఇయ‌న ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. త‌న‌ను ఎవ‌రు ప్ర‌శ్నిస్తార‌ని, త‌న‌కు ప్ర‌శ్నించే ద‌మ్ము ఎవ‌రికి ఉంటుంద‌నే ధీమాతో వ్య‌వ‌హ‌రించారు.

‘30 యాక్ట్’ అమల్లో ఉన్నా.. జేసీ పవన్‌ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. త‌న అనుచ‌రుల‌తో ఆయ‌న వీరావేశం ప్ర‌ద‌ర్శించారు. కార‌ణం ఏంట‌నేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం క‌రోనా ఉన్న నేప‌త్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌క్కాగా కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో యువ‌నాయ‌కుడు, యువ‌త‌కు ఆద‌ర్శంగా ఉండాల్సిన నాయ‌కుడు ప‌వ‌న్ మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. త‌న అనుచ‌రుల‌ను వేసుకుని ర్యాలీ చేశారు. అంతేకాదు.. త‌న‌ను అడ్డుకున్న పోలీసుల‌పైనా.. జేసీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించేలా రెచ్చ‌గొట్టారు. ఇక‌, పోలీసు జీపులపై ఎక్కి జేసీ వర్గీయుల హంగామా సృష్టించారు. దీంతో జేసీ పవన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు దీనిని రాజ‌కీయం చేసేందుకు జేసీ దివాక‌ర్ బ‌య‌ట‌కు వ‌స్తారు. త‌మ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో స్వేచ్ఛ లేద‌ని.. రాష్ట్రంలో అరాచ‌కం రాజ్య‌మేలుతోంద‌ని అనేయ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి చింత చ‌చ్చినా.. పులుపు చావ‌ద‌నే రాజ‌కీయాల‌కు జేసీ ఫ్యామిలీ కేరాఫ్‌గా ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.