Begin typing your search above and press return to search.

జేసీ బ్యాచ్ కు మరోమారు కోర్టు షాక్ తప్పలేదు

By:  Tupaki Desk   |   14 July 2020 5:45 AM GMT
జేసీ బ్యాచ్ కు మరోమారు కోర్టు షాక్ తప్పలేదు
X
సరిగ్గా తవ్వి చూస్తే కళ్లు చెదిరే అక్రమాలు వెలుగు చూస్తుంటాయి.ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొంది. జేసీ ట్రావెల్స్ వ్యాపారానికి సంబంధించిన కొత్త కోణాలు పలువురిని విస్మయానికి గురి చేస్తోంది. వీరి వ్యవహారమంతా చూసినప్పుడు జేసీ ట్రావెల్స్ ప్రయాణికులతో పాటు.. అవినీతిని కూడా నిత్యం రవాణా చేసినట్లుగా కనిపించక మానదు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు).. ఆయన కుమారుడు ఆస్మిత్ రెడ్డిలు అరెస్టు కావటం తెలిసిందే.

ప్రస్తుతం ఈ తండ్రికొడుకులు ఇద్దరూ కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు. తాజాగా వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు రిజెక్టు చేసింది. వీరి రిమాండ్ ను ఈ నెల 27వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఈ కేసులో కీలక నిందితుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సైతం కోర్టు తిరస్కరించింది.

తాజాగా జరిపిన విచారణలో కీలక అంశాలు కోర్టు ముందుకు రావటం.. కేసు విచారణలో వారు వెల్లడించిన వివరాలు కేసుకు కీలకంగా మారటంతో బెయిల్ రాలేదన్న మాట వినిపిస్తోంది. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం చెన్నైకి చెందిన ముత్తుకుమార్ ను తానుసంప్రదించినట్లుగా ప్రభాకర్ రెడ్డి అంగీకరించినట్లుగా సమాచారం బయటకు వస్తోంది. అంతేకాదు ఆర్టీఏ బ్రోకర్ సంజయ్ ద్వారా నాగాలాండ్ లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన వైనంపై కూడా తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారికి బెయిల్ రాలేదన్న మాట వినిపిస్తోంది.

తాము చేసిన తప్పులకు సంబంధించి మరిన్ని అంశాలు వెలుగు చూసినట్లు చెబుతున్నారు. ఫోర్జరీ పత్రాలతో తెలంగాణ.. కర్ణాటకల్లో ఎనిమిది వోల్వో బస్సులు.. లారీలు విక్రయించిన విషయం పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా సమాచారం. నిబంధనలకు విరుద్దంగా జరిగిన వాటిని ఒప్పుకుంటూనే.. అందులో తమ పాత్ర ఏమీ లేదని చెబుతున్న తీరు ఆసక్తికరంగా మారిందంటున్నారు. తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. విచారణలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయన కుమారుడు వెల్లడించిన వివరాలు.. వారిని మరింత ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.