Begin typing your search above and press return to search.

జేసీ బ్రదర్స్ ది భయమా.. పశ్చాత్తాపమా?

By:  Tupaki Desk   |   13 March 2017 6:11 AM GMT
జేసీ బ్రదర్స్ ది భయమా.. పశ్చాత్తాపమా?
X
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తరువాత విపక్ష నేత జగన్ ను టీడీపీ ఎమ్మెల్యే - ఆ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకరరెడ్డి అసభ్యంగా దూషించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభాకరరెడ్డి తీరుపై.. ఆయన తిట్ల దండకంపై అంతటా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ అభిమానులైతే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభాకరరెడ్డి రీసెంటుగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. అంతేకాదు.... జగన్ తల్లి విజయమ్మకు తాను క్షమాపణలు చెబుతున్నానంటూ క్షమాపణలు తెలిపారు. తన సహజ మాట తీరే అంత అని.. ఆ రోజు తాను అలా మాట్లాడకపోవాల్సిందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ ను - వైఎస్ కుటుంబాన్ని - ఆ కుటుంబ అభిమానులను బుజ్జగించే రీతిలో మాట్లాడుతూ స్వరం మార్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు తాను ఎంతగానో ఏడ్చానన్నారు. గతంలో వైఎస్ ఇంటికి వెళ్లి నపుడు తనకు అన్నం పెట్టి ఆదరించారని.. కాబట్టి విజయమ్మకు క్షమాపణ చెప్పేందుకు తానేమాత్రం వెనుకాడడం లేదని… 100 శాతం క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు. తాను కామన్‌గా అలాగే మాట్లాడుతుంటానని.. వైఎస్ కుటుంబం తన మాటలతో నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు.

అంతేకాదు.. రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు, పరిటాల రవి హత్య విషయంలోనూ మాట్లాడారు. పరిటాల రవి హత్య కేసులో తమతో పాటు జగన్‌ ప్రమేయం కూడా లేదన్నారు. పరిటాల రవి హత్య జరిగిన విధానం బట్టి అది రాయలసీమకు చెందిన వారు చేసింది కాదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. పరిటాల రవి హత్య వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పరిటాల సునీత .. సాధారణ గృహిణి అని ఆమెపై ఇప్పటికీ తనకు సానుభూతి ఉందన్నారు. టీడీపీలోకి వస్తామని తాము చంద్రబాబు వద్దకు వెళ్లలేదన్నారు. చంద్రబాబే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మధ్యవర్తిగా తన వద్దకు పంపించారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

అయితే.. ఆ రోజు అంత దారుణంగా మాట్లాడిన ప్రభాకరరెడ్డి ఇప్పుడిలా మాట్లాడడానికి కారణం ఉందంటున్నారు. జగన్ ఫ్యాన్స్.. వైసీపీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా వైసీపీలోకి వెళ్లే పరిస్థితి రావొచ్చన్న ముందు చూపు.. అలాగే ప్రస్తుతం బస్సు కేసులో కూడా వైసీపీ పూర్తిగా జోక్యం చేసుకుంటే ఇబ్బంది పడతామన్న భయం వల్ల ఆయన అన్ని మెట్లు దిగొచ్చి క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/