Begin typing your search above and press return to search.

ఈడీ ఎదుట జేసీ...బిగుసుకుంటోందా...?

By:  Tupaki Desk   |   7 Oct 2022 3:32 PM GMT
ఈడీ ఎదుట జేసీ...బిగుసుకుంటోందా...?
X
మొత్తానికి ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట జేసీ బ్రదర్ హాజరయ్యారు. దిగ్గజ నేత, మాజీ మంత్రి అయిన జేసీ దివాకరరెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపాలిటీ చైర్మన్ అయిన జేసీ ప్రభాకరరెడ్డి తన కుమారుడు జేసీ అశ్విత్ రెడ్డితో కలసి ఈడీ ముందుకు వచ్చారు. జేసీ కంపెనీ మీద ఇప్పటికే ఈడీ కేసు ఫైల్ చేసింది.

జేసీ కంపెనీ బీఎస్ త్రీ వాహనానలు బీఎస్ ఫోర్ గా మార్చి రిజిస్ట్రేషన్ చేశారన్నది ఒక ప్రధాన అభియోగం. అదే విధంగా చూస్తే ప్రభాకర‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దాంతో ఆయన ఈడీ ఎదుటకు విచారణ కోసం వచ్చారు. రవాణా శాఖలో అవకతవకలపై ఈడీ సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం కీలకంగా మారింది.

జేసీ సోదరుల సొంత కంపెనీగా జేసీ ట్రావెల్స్ ఉంది. జేసీ ట్రావెల్స్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఏపీతో పాటు, తెలంగాణా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ కర్ణాటక రాష్ట్రాలలో సాగుతోంది. బస్సు సర్వీసులను ఈ రాష్ట్రాలలో నడుపుతోంది. అయితే ప్రధాన‌ ఆరోపణలు ఏంటి అంటే అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి జేసీ ట్రావెల్స్ 154 బస్సులను స్క్రాప్ కింద కొనుగోలు చేసి, వాటిని ఆ తరువాత బస్సులుగా మార్చి నడుపుతున్నారని అంటున్నారు.

ఇక దీనితో పాటుగా ఈ త‌రహా వాటి కోసం నకిలీ పత్రాలతో నాగాలాండ్ రాష్ట్రంలో నమోదు చేసుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. మరో వైపు చూస్తే రవాణా శాఖ ఇచ్చే నకిలీ నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌తో బస్సులను దక్షిణాది రాష్ట్రాలకు తరలించారని, నిబంధనలను పక్కన పెట్టి మరీ జేసీ ట్రావెల్స్‌ సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో ఈ బస్సులన్నీ నడుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇలా స్క్రాప్‌ను కొనుగోలు చేసి వాటిని బస్సులుగా మార్చే ప్రక్రియను పూర్తి చేయడానికి నకిలీ సర్టిఫికేట్లు పత్రాలను సృష్టించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లోని ఈడీ ఆఫీసులో జేసీ ప్రభాకరరెడ్డి అశ్విత్ రెడ్డిలను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటికే జేసీ ట్రావెల్స్‌ కింద జేసీ సోదరులపై ఈడీ పలు కేసులు నమోదు చేసిందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే స్క్రాప్ నుంచి బస్సు భాగాలను మార్చడం అన్నది ఒక ఆరోపణ, అలాగే నకిలీ పత్రాలు సృష్టించారని మరో ఆరోపణ. ఇలా వాహనాల అక్రమ లావాదేవీల్లో ఈడీ కేసులు జేసీ సోదరులను వేధిస్తున్నాయి. మరి ఈడీ ఇపుడు విచారణలో ఏమేమి అంశాలు అధికారులు ప్రస్తావించారో ఈ కేసు ఏ కీలక మలుపు తీసుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే తమ మీద తప్పుడు కేసులు దొంగ కేసులు ఏపీ సర్కార్ పెట్టిందని ప్రభాక‌రరెడ్డి మీడియా ముందు విమర్శించారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎక్కడా భూకబ్జాలు కానీ మరోటి కానీ చేయెలేదని అంటున్నారు. ఈడీ అధికారులు పిలిస్తే వచ్చామని ఇందులో కొత్త విషయం ఏదీ లేదని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.