Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : వైసీపీకి షాక్..తాడిపత్రి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి !

By:  Tupaki Desk   |   18 March 2021 8:30 AM GMT
బ్రేకింగ్ : వైసీపీకి షాక్..తాడిపత్రి చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి !
X
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆసక్తిగా తనవైపుకు తిప్పుకుంది. తాజాగా విడుదల అయిన మున్సిపాలిటీ ఫలితాల్లో అక్కడ టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ఏకగ్రీవాలకు తోడు, ఎక్స్ అఫీషియల్ సభ్యుల బలంతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేసింది. దీనికితోడు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఓటు చెల్లదని కమిషనర్ ప్రకటించడంతో ఉత్కంఠ పెరిగింది. తాడిపత్రి లో గెలుపు ఎవరిది అంటూ జోరుగా బెట్టింగ్ లు కూడా సాగాయి. ఎట్టకేలకు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య ఈ మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌ గా టీడీపీ కౌన్సిలర్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్మన్ ‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. టీడీపీకి ఉన్న 18 మంది కౌన్సిలర్ల బలానికి తోడు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు ఇవ్వడంతో ప్రభాకర్‌ రెడ్డి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో రెండు వైసీపీ ముందే ఏకగ్రీవం చేసుకుంది. 34 వార్డులకు ఎన్నికలు జరగ్గా.. టీడీపీ 18, వైసీపీ 14, సీపీఐ, స్వతంత్రులు ఒక్కొక్కటి గెలుచుకున్నారు. వైసీపీకి ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ రంగయ్య నమోదు చేసుకున్నారు. దీంతో ఆ పార్టీబలం కూడా 18కి చేరింది. టీడీపీ తరఫున ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో టీడీపీ సొంతబలం 19 అవుతుందని భావించినా,‌ దీపక్‌ రెడ్డి ఓటును తిరస్కరించడంతో పరిస్థితి ఉత్కంఠంగా మరింది. రెండు పార్టీలకు చెరో 18 ఓట్లు ఉండడంతో చైర్మన్ పీఠం ఎవరిది అన్న ఉత్కంఠ పెరిగింది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకి మద్దతు తెలపడంతో టీడీపీ బలం 20కు చేరింది. దీంతో ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ అయ్యారు.

ఇదిలా ఉంటే .. ఏపీ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మూడు పిటీషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ ఎన్నికలను నిర్వహించకుండా సెలవుపై వెళ్లిపోతున్నారని పిటీషనర్లు అందులో పొందుపరిచారు. దీనిపై విచారించిన హైకోర్టు ఎస్ ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభిప్రాయాన్ని తెలియజేయాలని , ఎన్నికల నిర్వహణ పై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత ఈ కేసు విచారణను శనివారం నాటికి వాయిదా వేసింది.