Begin typing your search above and press return to search.

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆస్త‌లు ఎటాచ్‌.. ఈడీ యాక్ష‌న్‌

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:10 AM GMT
జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆస్త‌లు ఎటాచ్‌.. ఈడీ యాక్ష‌న్‌
X
టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కంపెనీకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) ఎటాచ్ చేసింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్‌ గోపాల్‌రెడ్డి కంపెనీ ఆస్తులను సైతం ఎటాచ్‌ చేసింది. దివాకర్‌ రోడ్‌లైన్స్‌, ఝ‌టాధార ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను జప్తు చేసింది. సుమారు ₹22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు ఈడీ వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఈడీ వెల్లడించింది. జటధార ఇండస్ట్రీస్, గోపాల్‌రెడ్డి అండ్ కో బీఎస్-4 వాహనాలు కొనుగోలు చేసినట్లు తెలిపింది. అశోక్ లేలాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్‌లో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వెల్లడించింది. రూ.38.36 కోట్ల అక్రమ క్రయ, విక్రయ లావాదేవీలు గుర్తించామన్న ఈడీ.. అశోక్ లేలాండ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.

స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్టు ఈడీ పేర్కొంది. బీఎస్‌ 4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపింది. రూ.6.31 కోట్ల విలువైన నగదు, అభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లు సీజ్‌ చేశారు. రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్‌ చేశారు.

జేసీ దివాకర్‌, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్‌ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్‌ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్‌ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్‌–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఎన్ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు తిప్పుతున్నారు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లతో (ఎన్ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు.

కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.