Begin typing your search above and press return to search.

సీమకు ‘‘కేసీఆర్’’ అవసరం వచ్చింది

By:  Tupaki Desk   |   6 Dec 2015 6:42 AM GMT
సీమకు ‘‘కేసీఆర్’’ అవసరం వచ్చింది
X
ప్రత్యేక రాయలసీమ అంశం తరచూ తెర మీదకు రావటం ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న పరిణామం. ప్రత్యేక రాయలసీమ నినాదంపై ప్రజల్లో ఎలాంటి భావాద్వేగాలు ఉన్నాయో తెలీని పరిస్థితి. కానీ.. కొందరు సీమ నేతలు. అది కూడా కర్నూలు.. అనంతపురం జిల్లాలకు చెందిన నేతలు మాత్రం మాట్లాడటం తెలిసిందే. తాజాగా ఏపీ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి (తాడిపత్రి) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ప్రత్యేక సీమ ప్రస్తావన తెస్తారన్నారు. తానిప్పుడు ఎమ్మెల్యే కావటంతో తాను ఆ ఉద్యమంలో పాల్గొనని చెప్పిన ఆయన.. రాజకీయ నిరుద్యోగుల ఆందోళనగా సీమ ఉద్యమాన్ని కొట్టిపారేశారు. రాజకీయ నిరుద్యోగుల నినాదాలుగా కాకుండా.. సీమ ప్రయోజనాల కోసం సీరియస్ గా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

సీమ ప్రయోజనాల కోసం సీరియస్ గా పని చేసే వారు.. దానికి సంబంధించి పోరాటం చేసే వాళ్లు కావాలని.. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ ఉన్నట్లుగా రాయలసీమకు సైతం అలాంటి దార్శనికత ఉన్న నాయకుడు లేదని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే.. సీమ ఉద్యమం ముందుకెళుతున్న జేసీ ప్రభాకర్ మాటలు చూస్తుంటే.. సీమకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక ‘‘కేసీఆర్’’ అవసరం ఉన్నట్లు అనిపించక మానదు.