Begin typing your search above and press return to search.

కదిలించి మరీ జేసీతో తిట్లు తిన్న రఘువీరా

By:  Tupaki Desk   |   25 Oct 2015 9:11 AM GMT
కదిలించి మరీ జేసీతో తిట్లు తిన్న రఘువీరా
X
నోటికొచ్చినట్లు మాట్లాడి ఇబ్బందుల్లో పడే రాజకీయ నేతలు ఉంటారు. అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా దర్జాగా ఉండటమే కాదు.. ఎలాంటి ఇబ్బందులు పడని నేతలు చాలా తక్కువమందే ఉంటారు. అలాంటి వారిలో జేసీ ఫ్యామిలీ ఒకటి. తమ మనసుకు తోచిన వ్యాఖ్యలు చేసే తత్వం జేసీ సోదరులకు ఎప్పటి నుంచో ఉన్నదే.

జేసీ సోదరుల్లో జేసీ దివాకర్ రెడ్డి తన ఇష్టంగా ఏ విషయం మీదనైనా మాట్లాడేస్తారు. నియోజకవర్గం మొదలుకొని జాతీయ స్థాయి అంశాల మీద అవసరానికి తగ్గట్లుగా మాట్లాడుతుంటారు. ఇక.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం నియోజకవర్గం లేదంటే అనంతపురం జిల్లా వరకూ అంశాల్ని తరచూ ప్రస్తావిస్తారు. తమకు వ్యక్తిగతంగా ఏదైనా అవసరమైతే మాత్రం రాష్ట్ర స్థాయి అంశాల్ని కూడా అరుదుగా టచ్ చేస్తుంటారు.

అలాంటి వారు.. తాజాగా తాము లంచం తీసుకుంటామని.. ఆ వచ్చిన డబ్బుతో నియోజకవర్గ అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. ఈ నేపథ్యంలో లంచాలు తీసుకొని ఆదాయాన్ని సమకూర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

దీంతో.. ఏపీ కాంగ్రెస్ రథసారధి రఘేవీరా వెంటనే స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటంటూ ప్రశ్నించారు. రఘువీరా ఎప్పుడైతే తన వ్యాఖ్యలపై స్పందించారు జేసీ ప్రభాకర్ ఊరుకోలేదు. వెంటనే స్పందించిన ఆయన రఘవీరాకు కౌంటర్ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న కాంక్షతో తానీ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పుకున్నారు. ఇకపై కూడా తాను లంచాలు తీసుకుంటానని.. వాటితోనే అభివృద్ధి చేస్తానని వ్యాఖ్యానించిన ఆయన.. రఘవీరా ఏమీ సత్య హరిశ్చంద్రుడేమీ కాదన్నారు. రఘువీరా తన జీవితంలో ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదా? అని సూటిగా ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులతో రఘువీరా నీలకంఠాపురం వచ్చి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా? అని సవాలు విసిరారు. ఒకవేళ రఘేవీరా రెడ్డి కానీ ప్రమాణం చేస్తే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు. జేసీ బ్రదర్ ను ఇబ్బంది పెట్టాలని రఘువీరా అనుకుంటే.. తాజా సవాలుతో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రఘువీరా మీద పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.