Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు తీసుకున్నవారు ప్రశ్నించొద్దు: జేసీ

By:  Tupaki Desk   |   5 April 2021 4:23 AM GMT
ఓటుకు నోటు తీసుకున్నవారు ప్రశ్నించొద్దు: జేసీ
X
మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సీపీఐ కాలనీలో పర్యటించిన ఆయనను సమస్యలపై ప్రజలు విన్నవించగా ఘాటుగా సమాధానమిచ్చారని ఓ వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రజలకు, జేసీకి మధ్య జరిగిన ఈ సంభాషణ సంచలనం సృష్టిస్తోంది. స్థానికులు మా కాలనీకి రోడ్డు వేయమని జేసీని కోరారు. దానికి జేసీ ‘డబ్బులు తీసుకోకుండా ఓట్లేసి ఉంటే నేను మీకు పనులు చేయాలి.. కానీ ఎప్పుడైతే పైసలు తీసుకున్నారో మీరు అడిగే హక్కు లేదు’ అంటూ ప్రజలను ఉద్దేశించి జేసీ వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

జేసీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నీతి, నిజాయితీగా ఓటు వేసినప్పుడే నిలదీసే హక్కు ఉంటుందని జేసీ వ్యాఖ్యానించినట్టుగా చెబుతున్నారు. ఓటును డబ్బులకు అమ్ముకుంటే సమస్యలపై నిలదీసే హక్కు కోల్పోతారన్నారు. తాను మాట్లాడిన మాటలలో తప్పులేదని.. స్వేచ్ఛగా, నిజాయితీగా ఓటు వేయండి.. ప్రజాప్రతినిధిని సమస్యలపై కాలర్ పట్టుకొని నిలదీసే హక్కు ఉంటుందని ప్రజలకు చెపుతున్న జేసీ వీడియో వైరల్ అయ్యింది.

ఇక మున్సిపల్ ఎన్నికల్లో తనకు సహకరించని వాలంటీర్ హరికుమార్ పై జేసీ మండిపడ్డారు. వాలంటీర్ ఇంటిని కూల్చేస్తానంటూ బెదిరించినట్టు ప్రచారం సాగుతోంది. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్ ను ఆయన అనుచరులు లాక్కెళ్లారని సమాచారం. బాధితులుడు పోలీసులను ఆశ్రయించగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.