Begin typing your search above and press return to search.

కాల్ మనీని కంట్రోల్ చేస్తే ప్రజలకే నష్టమట

By:  Tupaki Desk   |   18 Dec 2015 10:19 AM GMT
కాల్ మనీని కంట్రోల్ చేస్తే ప్రజలకే నష్టమట
X
మాటల తూటాలు పేల్చే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి ఈసారి బాంబు పేల్చారు. కాల్ మనీ వ్యవహారంతో రాష్ట్రం - అసెంబ్లీ అట్టుడుకుతున్న సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకుంటే ప్రజలకు అప్పు ఎలా పుడుతుందని ఆయన ప్రశ్నిస్తున్నారు.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాల్ మనీ వ్యవహారం ముదిరిన నేపథ్యంలో ప్రభుత్వం కాల్ మనీ వ్యాపారులపై రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తుంటే ఆయన మాత్రం దాన్ని వ్యతిరేకించారు. కాల్ మనీ దందా ఈ రోజుది కాదని, ఎప్పటినుంచో ఉన్నదేనని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగకుండా కాల్ మనీ వ్యాపారులను - వడ్డీలకు అప్పులిచ్చేవారిని అడ్డుకుంటే సామాన్య ప్రజలకు అప్పులిచ్చేవారు ఎవరని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీల నేతలకు కాల్ మనీ వ్యాపారంతో సంబంధాలున్నాయని మరో బాంబు పేల్చారు.

కాగా ప్రభాకరరెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం ఉన్నప్పటికీ, ప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండడం... దీనిపై న్యాయవిచారణకు ఆదేశించిన సమయంలో సొంత పార్టీ నుంచే ఆ విధానాన్ని వ్యతిరేకిస్తుండడం వివాదాస్పదమైంది. అయితే... పార్టీతో, పార్టీ విధానంతో సంబంధం లేకుండా వివిధ అంశాలపై తమ బుర్రలో పుట్టింది మాట్లాడేయడం జేసీ బ్రదర్స్ కు అలవాటే.