Begin typing your search above and press return to search.

చెప్పుల్లేకుండా వంగిపోయి మరీ నమస్కారం పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి

By:  Tupaki Desk   |   3 Aug 2021 3:34 AM GMT
చెప్పుల్లేకుండా వంగిపోయి మరీ నమస్కారం పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి
X
ఎవరెన్ని చెప్పినా అనంతపురం జిల్లా రాజకీయంలో జేసీ ఫ్యామిలీది తిరుగులేని వైనం. జేసీ బ్రదర్స్ లో దివాకర్ రెడ్డి మాటలతో సంచలనంగా మారుతుంటారు. ఇక.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో మాత్రమే కాదు.. చేతలతో వ్యవహరించే తీరు సంచలనంగా మారుతుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తన ఆగ్రహాన్ని ఆయన అస్సలు దాచుకోరు. నిర్మోహమాటంగా ఆయన చూపించేస్తుంటారు.

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆయనకు తాజాగా అధికారులు షాకిచ్చారు. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో అధికారులు.. సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వారంతా మూకుమ్మడిగా గైర్హాజరు కావటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనదైన రీతిలో రియాక్టు అయ్యారు. తనదైన శైలిలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

సోమవారం ఉదయం 10.30 గంటలకు సిబ్బందితో సమీక్షా సమావేశం ఉంటుందని కమిషనర్ తో సహా అందరికి శనివారమే ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డిసమాచారం అందించారు. అయితే.. అదే సమయానికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ సిబ్బందితో కలిసి కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ.. సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయటంతో మున్సిపల్ అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

ఇలాంటి వేళ.. ఎమ్మెల్యేతో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరైన మున్సిపల్ సిబ్బంది అందరూ అక్కడికే వెళ్లారు. ఆ సమావేశం మధ్యాహ్నం 12.30 గంటలవరకు సాగింది. ఎమ్మెల్యేతో రివ్యూ మీటింగ్ తర్వాత నేరుగా ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే..మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు వస్తారన్న ఉద్దేశంతో తన చాంబర్ లోనే ఉండిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ సోమవారం మధ్యాహ్నం నుంచి సెలవుపై వెళుతూ.. ఇతరులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలియటంతో ఛైర్మన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అధికారులు ఆఫీసుకు వస్తే కానీ కదిలేది లేదని.. అక్కడే ఉండిపోయారు. దీంతో సాయంత్రం 4.30 గంటలకు కొందరు అధికారులు రాగానే వారిని మెచ్చుకునేలా మాట్లాడుతూ.. వారి కమిట్ మెంట్ ను తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. అధికారుల్నిచూసినంతనే కాళ్లకు చెప్పలు వదిలేసి.. దాదాపు వంగిపోయి.. రెండు చేతులు జోడించిన తీరుతోఉద్యోగులు స్థాణువులుగా నిలబడిపోయారు. ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో వారున్నారు.

ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా గైర్హాజరు అవుతారని.. ఎలా సెలవు మీద వెళతారని.. ఛైర్మన్ ఆదేశాల్ని కాదని సిబ్బంది ఎందుకు గైర్హాజరు అవుతారని ప్రశ్నిస్తూ 26 మందికి తాఖీదులు పంపుతున్నట్లుగా ప్రకటించారు. మొండివాడైన జేసీ.. కమిషనర్ తీరుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రివేళ తన ఛాంబర్ కే డిన్నర్ తెప్పించుకొని.. అక్కడే నిద్ర పోవటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. కమిషనర్ మాత్రం ఎవరికి అందుబాటులో లేకుండా ఉండటం గమనార్హం.

మరో ట్విస్టు ఏమంటే.. తాడిపత్రి పురపాలక కార్యాలయ సిబ్బంది 26 మంది కనిపించటం లేదంటూ మున్సిపల్ ఛైర్మన్జేసీ ప్రభాకర్ రెడ్డి సోమవారంరాత్రి పట్టణ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల అధికారులు టెంకాయల వ్యాపారం చేసే వారికి హెచ్చరికలు జారీ చేశారని.. అందుకే వారికి ఎవరైనా హాని తలపెట్టి ఉంటారన్న ఆందోళన చెందుతున్నట్లుగా చెప్పి.. అధికారులకు తన తీరుతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏమైనా.. ఇలాంటివి జేసీకి మాత్రమే సాధ్యం.