Begin typing your search above and press return to search.

తెలుగు త‌మ్ముళ్ల‌లో పండ‌గ పంచాయ‌తీ

By:  Tupaki Desk   |   24 Aug 2016 11:19 AM GMT
తెలుగు త‌మ్ముళ్ల‌లో పండ‌గ పంచాయ‌తీ
X
తెలుగుత‌మ్ముళ్ల‌లో క్ర‌మ‌శిక్ష‌ణ కొర‌వ‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు ఇటీవ‌ల పెద్ద ఎత్తున వినిపిస్తుండ‌గా మ‌రో వివాదం తెర‌మీద‌కు వ‌చ్చింది. కొద్దికాలం క్రితం వ‌ర‌కు ర‌చ్చ‌రచ్చ‌గా కొన‌సాగి ఇటీవ‌లే స‌ద్దుమ‌ణిగి అనంత‌పురం జిల్లా టీడీపీ నేత‌ల వివాదం మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. వందేళ్ల ఘన చరిత్ర ఉన్న ఆర్ట్స్‌ కళాశాల శత జయంతి ఉత్సవాలు వేదిక‌గా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ‌ర్సెస్ అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వ‌ర్గం ఏకంగా పాత్రికేయ సమావేశాలు పెట్టుకొని విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

అనంత‌పురం ఎమ్మెల్యే హోదాలో కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంపై ప్ర‌భాక‌ర్ చౌద‌రి నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్న తీరును జేసీ ప్రభాక‌ర్ రెడ్డి త‌ప్పుప‌ట్టారు. భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా నిర్వహించాలని ఆయ‌న‌ సూచించారు. కొందరు నాయకులు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా చౌద‌రి పేరును ఉద్దేశించి కామెంట్ చేశారు. త‌మ సొంత సంస్థ అయిన‌ దివాకర్‌ ట్రావెల్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్స‌వాల విష‌యంలో కూడా సొంత పోక‌డ‌లు స‌రికాద‌న్నారు. వేడుక‌ల‌కు రాజకీయ రంగు పులిమి సొంత కమిటీలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాల ప్రతిష్ట దెబ్బతీసేలా చేస్తే సహించేది లేదన్నారు. పూర్వ విద్యార్థులు - కళాశాల పూర్వ అధ్యాపకులు - ప్రస్తుత అధ్యాపకులు - కళాశాలలో చదివి వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ సమావేశపరచి శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.

దీనిపై చౌద‌రి వ‌ర్గీయులు సైతం ఘాటుగా స్పందించారు. జేసీ బ్ర‌ద‌ర్స్ సొంత నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించ‌డం మేల‌ని పేర్కొన్నారు. కాలేజీ అభివృద్ధికి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోకుండా వేడుక‌ల మీద స్టేజీ ఎక్కాల‌నే ఆతృత‌ను మాత్రం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్య‌క్తికి వేడుక‌లు నిర్వ‌హించ‌డంపై ఎవ‌రి నుంచో సూచ‌న‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కామెంట్ చేశారు.