Begin typing your search above and press return to search.

జేసీ.. ఖైదీనంబర్ 2077

By:  Tupaki Desk   |   14 Jun 2020 8:39 AM GMT
జేసీ.. ఖైదీనంబర్ 2077
X
ప్రైవేటు బస్సుల లైసెన్సుల ట్యాంపరింగ్, బీఎస్ సర్టిఫికెట్ల గోల్ మాల్ వ్యవహారంలో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను కడపలోని కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే.. అనంతపురం జైలుకు తరలించాల్సి ఉన్నా.. అక్కడ ఓ ఖైదీకి కరోనా వైరస్ సోకడంతో కడప జైలుకు తరలించాల్సి వచ్చింది.

కడప కేంద్ర కారాగారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు ఖైదీ నంబర్లను కేటాయించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి 2077, ఆస్మిత్ రెడ్డికి 2078 నంబర్ ను జైలు అధికారులు కేటాయించారు. 14 రోజుల రిమాండ్ తో వీరు కడప సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు. 14రోజుల రిమాండ్ ముగిసిన తర్వాత మళ్లీ అనంతపురం తీసుకెళ్లనున్నారు. బెయిల్ లభించకపోవడం.. రిమాండ్ ను పొడిగించాల్సిన పరిస్థితులు అంటూ తలెత్తితే మళ్లీ కడపకే తీసుకొస్తారని అంటున్నారు.

రిమాండ్ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను తాడిపత్రి సబ్ జైలులో వారిని ఉంచాలనే ప్రతిపాదనను జిల్లా పోలీసులు కనీసం పరిశీలనలో కూడా తీసుకోలేదు. తాడిపత్రి జేసీ కుటుంబం స్వస్థలం కావడం వల్ల ఉద్రిక్తత తలెత్తుతుందని పోలీసులు భావించారు.

జేసీ కుటుంబం అనుచరులు జైలు వద్ద ధర్నాలు, నిరాహార దీక్షలకు దిగే అవకాశాలు లేకపోలేదంటూ అనుమానించారు. ఫలితంగా పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటం వల్లే తాడిపత్రి జైలు పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. అందుకే పక్కా జిల్లా కడపకు తరలించారు.