Begin typing your search above and press return to search.

బయటపడ్డ జేసీ బ్రదర్స్ మరో చీకటి కోణం..మరీ ఇంత కక్కుర్తి ఎందుకయ్యా?

By:  Tupaki Desk   |   10 Jun 2020 12:30 PM GMT
బయటపడ్డ జేసీ బ్రదర్స్ మరో చీకటి కోణం..మరీ ఇంత కక్కుర్తి ఎందుకయ్యా?
X
జేసీ బ్రదర్స్ ..తెలుగు రాష్ట్రాల సీనియర్ రాజకీయ నాయకులుగా అందరికి బాగా తెలుసు. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ..తనదైన శైలిలో ప్రత్యర్థులపై ..ఒక్కొక్క సారి తమ పార్టీకి చెందిన వారిపై కూడా విమర్శలు చేస్తుంటారు. అలాగే వీరికి వ్యాపారాలు కూడా బాగానే ఉన్నాయి. కాగా , ఈ మధ్య కాలంలో వారు చేసే వ్యాపారాలకు సంబంధించి కళ్లు చెదిరే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఏపీ రవాణా శాఖ అధికారులు విధులు సరిగ్గా నిర్వహిస్తుండటంతో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చాయి. దీంతో జేసీ బ్రదర్స్ పై ఏకంగా ఇరవై నాలుగు కేసులు బుక్ చేశారు.

ఈ మధ్య బీఎస్ -3 వాహనాల్ని బీఎస్-4గా చూపించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అక్రమంగా తిప్పుతున్నారు అని కనిపెట్టగా ... తాజాగా లారీల్ని కొనుగోలు చేసి వాటిని బస్సులుగా మార్చి తిప్పుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఇలా చెప్పుకుంటే జేసీ వారి వ్యాపార అక్రమ లీలలు ఎన్నో ఉన్నాయి. వారి అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయన్నది తాజాగా రవాణా శాఖ అధికారులు వెల్లడించారు. అశోక్ లేలాండ్ తయారు చేసిన బీఎస్-3 లారీల్ని తుక్కు కింద పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం, అక్రమ రిజిస్ట్రేషన్ల కు పాల్పడినట్లు గుర్తించారు.

98 లారీల్ని నాగాలాండ్ లో.. 32 లారీల్ని ఏపీలో, మరో 24 లారీల్ని తమిళనాడు, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లారీల్లో 101 లారీలు ఏపీలో , 33 కర్ణాటకలో 15 తెలంగాణలో, తమిళనాడు, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు లారీల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. అలాగే మరో నాలుగు లారీల్ని బస్సులుగా మార్చి తిప్పుతున్నారు అని కనిపెట్టారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన లారీల్ని బ్లాక్ లిస్టులో ఉంచాలని నిర్ణయించారు. లారీల్ని జాతీయ వాహన డేటా బేస్ నుంచి తొలగించారు. దీంతో వాటిని అమ్మే అవకాశం లేకుండా పోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లారీలకు తీసుకున్న బీమా పత్రాలు కూడా నకిలీవేనన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన లారీల్ని వేర్వేరు వారికి అమ్మేసిన వైనం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో జేసీకి చెందిన జటాధర కంపెనీపై చీటింగ్ కేసులు పెట్టారు. ఏదేమైనా ఎన్నో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్న జేసీ బ్రదర్స్ ..మరీ ఇంత చీఫ్ గా చేయడం అవసరమా ?