Begin typing your search above and press return to search.

సోమవారం అర్థరాత్రి.. హైదరాబాద్ లో రౌడీషీటర్ల ఆరాచకం

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:12 AM GMT
సోమవారం అర్థరాత్రి.. హైదరాబాద్ లో రౌడీషీటర్ల ఆరాచకం
X
హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రధాన మీడియా సంస్థల్లో సైతం ఇంకా ఈ ఉదంతం గురించి వార్తలు టెలికాస్ట్ కాలేదు. సోమవారం అర్థరాత్రి వేళలో హైదరాబాద్ లోని ఒక ప్రాంతంలో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. తమకు తిరుగులేదన్నట్లుగా చెలరేగిపోయారు.

తాము అనుకుంటే ఏమైనా చేస్తామన్నట్లుగా వ్యవహరించిన ఈ తీరును చూస్తే.. బాహాటంగా ఎవరు.. ఏమైనా చేసేస్తారా? వారి తెగింపు వెనుకున్న అభయం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ ఏం జరిగిందంటే..
హైదరాబాద్ మహానగరంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కార్వాన్. మజ్లిస్ అధినేత కనుసన్నల్లో ఉంటూ.. తిరుగులేని పవర్ ను చెలాయించే నియోజకవర్గాల్లో ఇదొకటి.

తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎవరు అధికారంలో ఉన్నా.. మజ్లిస్ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో తాము తప్పించి మరొకరు గెలిచేందుకు ససేమిరా అన్నట్లుగా వ్యవహరించే ఈ నియోజకవర్గంలో కొందరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చెబుతారు.

ఈ నియోజకవర్గ పరిధిలోని తప్పచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 86 ఫిల్లర దగ్గరున్న ఒక వైన్ షాపును.. ఒక చికెన్ షాపును అర్థరాత్రి వేళ.. ఎలాంటి అనుమతులు లేకుండానే.. జేసీబీనీ తిసుకొచ్చేసి కూల్చేసిన వైనం సంచలనంగా మారింది. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకున్న ఈ పరిణామం గురించి షాపుల యజమానులకు సమాచారం అందించటంతో వారు ఉరుకులు పరుగుల మీద వచ్చారు.

రౌడీషీటర్లు చేసిన పనికి వైన్ షాపులో ఉన్న రూ.37లక్షల మద్యం నేలపాలైందని వెల్లడించారు.అయితే.. ఈ ఉదంతంలో స్థల యజమాని మాట్లాడుతూ.. తన స్థలాన్ని ఆక్రమించుకోవటానికి బడా బాబుల మద్దతుతో ఇప్పటికే పలుమార్లు దాడి చేసేందుకు ప్రయత్నించారని.. తాజాగా షాపుల్ని జేసీబీని తీసుకొచ్చేసి కూల్చేసినట్లుగా పేర్కొన్నారు. కొందరు బడాబాబుల అండతోనే అర్థరాత్రి వేళ జేసీబీల్ని తీసుకొచ్చి షాపుల్ని నేలమట్టం చేశారంటున్నారు.

ఈ ఆస్తి తమకు తాత ముత్తాతల నుంచి వచ్చిందని.. అయితే.. దీనికి సంబంధించిన వివాదం ఒకటి కోర్టులో నలుగుతున్నట్లుగా చెబుతున్నారు.

కోర్టు నుంచి అధికారిక ఆదేశాలు రాకుండానే.. తమకుతాముగా రౌడీ షీటర్ల అండతో వ్యవహరించిన వైనం స్థానికంగా పెను సంచలనంగా మారింది. ఎవరికి వారు.. తమదనుకున్న స్థలంలోకి జేసీబీని తీసుకొచ్చేసి.. అక్కడున్న ఆస్తుల్ని నేలమట్టం చేసేస్తే పరిస్థితి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్న. మరి.. దీనిపై పోలీసులు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.