Begin typing your search above and press return to search.

తొందరపడి పవన్ ముందే వచ్చాడు..

By:  Tupaki Desk   |   10 Jun 2019 9:00 AM GMT
తొందరపడి పవన్ ముందే వచ్చాడు..
X
సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి హిట్ అయ్యింది చాలా తక్కువ మంది. రాజకీయాలను శాసించింది కొందరే.. తెలుగు నాట ఎన్టీఆర్ - తమిళనాడులో ఎంజీఆర్ - జయలలిత తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రులయ్యారు. ఆ తర్వాత ఇదే స్ఫూర్తితో వచ్చిన చిరంజీవి మాత్రం నిలదొక్కుకోలేదు. కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టి ఈదుతున్నాడు.

ఇప్పుడు తెలుగునాట పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలను శాసిద్దామని వచ్చి తను పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయాడు. నిజానికి ఎన్టీఆర్ వచ్చిన సందర్భం వేరు. అనాడు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఏపీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అవినీతి - లంచగొండితనం.. పీడన - పేదరికం పెరిగిపోయి ఒక ఆశ కోసం ఎదురుచూశారు. అలా కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ ను ప్రజలు నెత్తిన పెట్టుకొని గెలిపించారు. ఇక ఎన్టీఆర్ కూడా తన సినిమా జీవితం పూర్తి అయిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.

కానీ చిరంజీవి కానీ.. పవన్ కానీ చేసిన తప్పు ఏంటంటే.. ఏపీలో అధికార ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావడం.. అది సినిమా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు దాన్ని వదిలి రావడం పెద్ద తప్పుగా చెప్పవచ్చు. చిరు వచ్చినప్పుడు వైఎస్, బాబు.. ఇప్పుడు పవన్ కు పోటీగా జగన్, బాబు ఉన్నాడు. అందుకే జనం ముందు ఈ సినీ రాజకీయం పనిచేయలేదు.

అయితే సమయం, సందర్భం ఉన్నప్పుడు వస్తే రాజకీయాలను శాసించవచ్చని.. తొందరపడి ముందే వస్తే రాజకీయాల్లో ఎదగలేరని తాజాగా టాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన జేడీ చక్రవర్తి విశ్లేషించారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావచ్చని..కానీ పవన్ మాత్రం తొందరపడి వచ్చాడని.. ఇంకాస్త టైమ్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్లుంటే బాగుండేదని చక్రవర్తి అభిప్రాయపడ్డారు. కొన్ని ఏళ్లు గడిచాక రాజకీయశూన్యత ఉన్నప్పుడు వస్తే బాగుండేదన్నారు. ఇలా ఎప్పుడు వచ్చామన్నది కాదు.. ఎలా వచ్చామన్నదే ముఖ్యమని సినీ తారలు అర్థం చేసుకుంటే ఆ పరాజయాలు ఉండవని జేడీ చక్రవర్తి విశ్లేషించారు.