Begin typing your search above and press return to search.

చివరికి జేడీ కూడానా... ?

By:  Tupaki Desk   |   30 Dec 2021 4:43 AM GMT
చివరికి జేడీ కూడానా... ?
X
ఆయన సమర్ధుడైన ఐపీఎస్ అధికారి. ఆయన జగన్ ఎంపీగా ఉన్నపుడు ఆయన మీద వచ్చిన అవినీతి కేసులను డీల్ చేసిన పవర్ ఫుల్ సీబీఐ అధికారి. ఇక జేడీకి నాడు వచ్చిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు, జేడీ ఇంతలా జగన్ కేసుల విషయంలో స్ట్రిక్ట్ గా వ్యవహరించడంతో ఆనాడే ఆయన ఏ వూరి మనిషి, ఏ వాడ మనిషి, ఆయన కుల గోత్రాలు ఏంటి అన్న చర్చ మరో వర్గం వారు గట్టిగానే లేవదీశారు.

ఇంకొందరు ఔత్సాహీకులు అయితే ఆయన్ని ఏకంగా టీడీపీకి మద్దతుదారుగా, ఆ పార్టీని అభిమానించే ఒక ప్రధాన కులం మనిషిగా లెక్క కట్టారు. దాని మీద ఆనాడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఒక చానల్ ఇంటర్వ్యూలో జరిగిన డిబేట్ మాట్లాడుతూ జేడీ కులం ఏంటో రివీల్ చేస్తే తప్ప ఆ విష ప్రచారం ఆగలేదు.

అంతలా కులం హద్దులను దాటి తన విధి నిర్వహణను ఆయన చేసినా కూడా నాడు కులాల గోల అంటగట్టాలని చూశారు. ఇక జేడీ స్వచ్చందంగా తన ఉద్యోగానికి 2018లో రాజీనామా చేసి రాజాకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేశారు. నాడు కూడా ఆయన మీద ఎంతో కొంత కుల ముద్ర వేయాలని చూశారు. అయితే ఆయన ఇమేజ్ ముందు అది సక్సెస్ కాలేదు.

ఇవన్నీ పక్కన పెడితే ఇంతటి విద్యాధికుడు, మేధావి ఇపుడు ఒక కుల సమావేశానికి వెళ్లారన్న టాక్ అయితే గట్టిగానే ప్రచారంలో ఉంది. ఏపీలో కాపు నేతల సమావేశానికి జేడీ లక్ష్మీనారాయణ కూడా అటెండ్ అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు పాల్గొన్న ఆ సమావేశానికి జేడీ కూడా హాజరు అయ్యారని చెబుతున్నారు.

సరే ఆ సమావేశం అజెండా ఎలా ఉన్నా కాపులకు రాజకీయంగా జరిగిన అన్యాయం సంగతి పక్కన పెట్టినా జేడీ లాంటి ఇంటలెక్చువల్ పర్సనాలిటీ కూడా కులం హద్దులను దాటలేకపోతున్నారా అన్నదే చర్చగా ఉంది మరి. ఆయనకు అన్నింటికీ అతీతంగా ఎంతో మంది యూత్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాలలో ఉంది.

అయితే రాజకీయాల్లో రాణించాలి అంటే కులం మతం, ప్రాంతం అన్నవి అన్నింటికీ మించి ప్రధాన అర్హతలుగా మారిన సమయమిది. అందుకే జేడీ లాంటి వారు అయినా ఆ రాజకీయ లెక్కలు చదవాల్సిందే అన్న మాట ఉంది. గతంలో కూడా మరో మేధావి, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ్ కూడా తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న కూకట్ పల్లిని ఎంచుకుని మరీ పోటీ చేసి గెలిచారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు అధికారులూ దేశాన్ని దశ దిశా మార్చాలని వచ్చిన వారు. చివరికి రాజకీయాలను మార్చలేక తామే మారాల్సిరావడమే రాజకీయ విషాదంగా చూడాలేమో.