Begin typing your search above and press return to search.

జేడీ రెడీ... రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్...?

By:  Tupaki Desk   |   5 Sep 2022 3:40 PM GMT
జేడీ రెడీ... రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్...?
X
జేడీ లక్ష్మీనారాయణగా తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం అయిన వీవీ లక్ష్మీ నారాయణ సీబీఐ లో ఉన్నత స్థాయిలో అత్యున్నత అధికారిగా పని చేసి స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. ఆయన ప్రజా ప్రతినిధిగా సేవ చేయాలని భావిస్తూ 2019 ఎన్నికలకు రెండేళ్ళు ముందుగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయన సొంతంగా పార్టీ పెడతారని నాడు ప్రచారం జరిగినా కూడా చివరికి ఆయన సినీ నటుడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు.

ఆయన దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్ల దాకా రాబట్టారు. కేవలం పక్షం రోజుల వ్యవధిలోనే ఆయన చేసిన ప్రచారానికి ఇంత పెద్ద ఎత్తున ఓట్లను దక్కించుకున్నారు. ఆయనను ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. విద్యార్ధులు, యువతరం ఆయన స్పీచ్ లకు ఎక్కువగా స్పూర్తి పొందుతారు. ఆయన అవినీతి రహిత నిజాయతీతో కూడిన రాజకీయాలను చేయడానికే తాను ఉన్నానని చెబుతారు.

ఇదిలా ఉండగా జేడీ ఈనాటి సీఎం వైఎస్ జగన్ కేసులను చూసిన సీబీఐ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన హై ప్రొఫైల్ కేసులు చూడడం వల్ల కూడా తెలుగు నాట సినీ నటులతో సరిసమానంగా ఆయనకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఒక దశలో ఆయన కనుక పార్టీ పెడితే బాగుంటుంది అని అన్న వారూ ఉన్నారు.

అయితే జనసేనలో పోటీ చేసి ఓడిన తరువాత జేడీ కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఆయన జనసేనకు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఇపుడు మళ్ళీ ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు అని అంటున్నారు. ఆయన రాజకీయాల్లో రీ ఎంట్రీకి ముహూర్తం కూడా పెట్టుకున్నారని ప్రచారం సాగుతోంది.

అన్నీ అనుకూలిస్తే ఆయన తన రాజకీయ రీ ఎంట్రీ నిర్ణయాన్ని అక్టోబర్ 2న ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. ఆ రోజు గాంధీ జయంతి. దాంతో ఆ రోజున ఆయన తన రీ ఎంట్రీ ప్రకటన చేయాలనుకుంటున్నారుట. ఇక ఏపీలో ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాలు చేస్తారు అన్న దాని మీద కూడా రకరకాలైన ప్రచారం సాగుతోంది.

అయితే ఆయన మళ్ళీ జనసేనలో చేరరు అన్నది కన్ ఫర్మ్ అంటున్నారు. ఇక ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలను కూడా ఆయన ఎంచుకోరు అని అంటున్నారు. దాంతో ఆయనకు ఉన్న ఆప్షన్ బీజేపీ లేదా ఆప్ అని అంటున్నారు. ఆ మధ్యన జేడీ ఆప్ లో చేరి ఏపీ విభాగానికి ప్రెసిడెంట్ గా ఉంటారని టాక్ అయితే నడిచింది. ఇపుడు కూడా ఆయన ఆప్ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆప్ కి ఏపీలో ఉన్న బలం ఏంటి అన్నది కూడా చూస్తున్నారని టాక్.

అదే టైమ్ లో బీజేపీలో చేరితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా జేడీ చేస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరి విశాఖ నుంచి ఆయన మరో మారు ఎంపీగా పోటీ చేస్తారు అని అంటున్నారు. గతంలో విశాఖ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా హరిబాబు గెలిచిన చరిత్ర ఉంది. అయితే నాడు పొత్తులతో అది సాధ్యపడింది. మరి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పొత్తులతో ముందుకు వస్తే కనుక కచ్చితంగా జేడీ గెలిచే అవకాసాలు ఉంటాయి. ఏది ఏమైనా జేడీ పొలిటికల్ రీ ఎంట్రీ ఆసక్తికరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.