Begin typing your search above and press return to search.

జగన్ చెప్పిందే కరెక్ట్...అన్నది ఎవరో తెలుసా.. ?

By:  Tupaki Desk   |   16 Dec 2021 3:39 PM GMT
జగన్ చెప్పిందే కరెక్ట్...అన్నది ఎవరో తెలుసా.. ?
X
జగన్ చెబితే వేదమా. ఆయనకు ఏం తెలుసు. ఆయన మీద ఇవే కదా ప్రతీ రోజూ వచ్చే వెల్లువెత్తిన ఆరోపణలు. ఆయన మొండి అని, ఎవరి మాటా వినరని కూడా అంటారు కదా. అలాంటి జగన్ ఒక విష‌యంలో చెప్పిన దాన్ని మాత్రం తప్పక పాటించాల్సిందే. ఆయన ఇచ్చిన సూచనలు బాగున్నాయి అని ఎవరైనా అంటే అది చిత్రం. ఇక అలా అన్నది సీబీఐ మాజీ జేడీ అయితే. జగన్ అక్రమాస్తుల కేసులను విచారించిన స్ట్రిక్ట్ పోలీస్ అధికారి అయితే ఇంకా ఆశ్చర్యమే.

అవును. ఇది నిజమే. జగన్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి చేసిన సూచనలు భేష్ అంటూ మెచ్చుకున్నది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. అంతే కాదు, వాటిని అమలు చేసే సరిపోతుంది. ఎలాంటి ప్రైవేటీకరణ అవసరం లేదు అని కూడా ఆయన హై కోర్టుకు తాను సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొనడం అంటే చాలా విశేషంగానే చూడాలి.

ఇంతకీ ఈ కధా కమామీషూ ఏంటి అంటే విశాఖ ఉక్కుని కేంద్రం ప్రైవేట్ పరం చేయాలనుకుంటోంది. వద్దు అని కార్మికులు ఒక వైపు ఉక్కు పోరాటమే చేస్తున్నారు. వారు నెలల తరబడి ఆందోళన చేపడుతున్నారు. అదే టైమ్ లో రాజకీయ పార్టీలు తమ మద్దతుని వారికి అందిస్తూ వస్తున్నాయి. మరి స్టీల్ ప్లాంట్ మీద అధికారంలో ఉన్న జగన్ ఏం చేశారు, ఏం చెప్పారు అన్నది చాలా ఇంపార్టెంట్ కదా.

జగన్ ఆరు నెలల క్రితం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అనేక ప్రత్యామ్యాయాలను కేంద్రానికి సూచించారు. అలా కనుక చేస్తే స్టీల్ ప్లాంట్ కచ్చితంగా బతికి బట్టకడుతుంది అని కూడా చెప్పారు. సరిగ్గా ఈ పాయింట్స్ నే పరిగణనలోకి తీసుకోండి. జగన్ కేంద్రానికి రాసిన లేఖనే మీరు కూడా పరిగణనలోకి తీసుకోండి. ఏపీకి న్యాయం జరుగుతుంది అని కోర్టు ద్వారా కేంద్రాన్ని కోరింది ఎవరో కాదు జేడీ లక్ష్మీనారాయణ.

ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన స్టీల్ ప్లాంట్ గురించి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా హై కోర్టులో జరిగిన విచారణలో ఆయన సమర్పించిన అఫిడవిట్ లో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖలోని అంశాలను ప్రస్థావించారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ దూరదృష్టితో స్టీల్ ప్లాంట్ విషయంలో చేసిన సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని అఫిడవిట్ లో జేడీ తరఫున న్యాయవాది పేర్కొనడం విశేషం. స్టీల్ ప్లాంట్ కోసం నాడు భూములు ఇచ్చిన ఎనిమిది వేల మంది రైతులకు న్యాయం జరగలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే వారికి ఏ విధంగా ఊరట లభిస్తుంది అని కూడా ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల వారికి అన్యాయం జరిగి రాజ్యాంగం ప్రకారం మౌలిక హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అని కూడా ఆయన పేర్కొన్నారు.

అంతే కాదు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అనేక మార్గాలు ఉన్నాయి. అందుకో ఏపీ సీఎం జగన్ కేంద్రానికి సూచించినవి చాలా ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకుంటే చాలు ప్లాంట్ బతికి బట్ట కడుతుంది అని జేడీ తరఫున దాఖలైన అఫిడవిట్ లో పేర్కొనడం విశేషం. మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ చేసిన సూచనలు చాలా విలువ అయినవి అని మేధావిగా, నిబద్ధత కలిగిన అధికారిగా ఉన్న జేడీ భావించడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. మొత్తానికి జేడీ రాజకీయాలకు అతీతంగా మంచి విషయాలను గ్రహించడమే కాదు, స్టీల్ ప్లాంట్ మీద పోరులో తనదైన చిత్తశుద్ధిని చూపిస్తూ ఏపీలోని ఇతర రాజకీయ పార్టీలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు అన్నది నిజం.