Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే హత్యపై ఆయన నోటా అదే మాట

By:  Tupaki Desk   |   25 Sep 2018 4:24 AM GMT
టీడీపీ ఎమ్మెల్యే హత్యపై ఆయన నోటా అదే మాట
X
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు కాల్చిచంపడంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. అక్రమ క్వారీయింగ్ వల్లే ఇదంతా జరిగిందని అంటూ ఆయన అన్యాపదేశంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కిడారి మరణానికి పాలక టీడీపీ పెద్దలే కారణమని ఆయన నేరుగా చెప్పనప్పటికీ తన సన్నహితుల వద్ద అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. విశాఖ మన్యంలో జరుగుతున్న మైనింగ్‌ లో ప్రభుత్వ పెద్దల పాత్రపై తనకు సమాచారం ఉందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. కాగా... మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కేవలం ఒక చిన్న చేప మాత్రమేనని... ఇక్కడి క్వారీయింగ్ అంతా ప్రభుత్వ ముఖ్యులదేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు .... మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ ప్రవేశంపైనా కొంత క్లారిటీ ఇచ్చారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో పలు విషయాలపై స్పందించారు. ఏపీ రాజకీయాల్లోకి తప్పకుండా త్వరలో వస్తానన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సీబీఐ ప్రత్యేకాధికారిగా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తరువాత ఆయన ఏపీలోని అన్ని జిల్లాల్లో తిరుగుతున్నారు. రైతులను చైతన్య పరుస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరుతున్నారు. యువ రైతులను - యువకులను ఉత్సాహపరుస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పలు రాజకీయ పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానాలు కూడా అందాయి. దేనిపై స్పష్టంగా స్పందించని ఆయన ఎట్టకేలకు తన మనసులోని మాటలను బయట పెట్టారు. త్వరలో రాజకీయ ప్రవేశం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ రైతాంగ సమస్యలు తెలుసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశమేనని చెప్పారు.