Begin typing your search above and press return to search.

ఉండవల్లి - జేడీ జోడీ...మోడీతో ఢీ

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 PM GMT
ఉండవల్లి - జేడీ జోడీ...మోడీతో ఢీ
X
ఆ ఇద్దరినీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారిద్దరూ ఎవరి మటుకు వారు ప్రాచుర్యం పొందిన వారే. సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే రెండు సార్లు కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలను మానుకున్నా కూడా విశ్లేషకుడిగా ఉంటున్నారు. కీలకమైన అంశాల మీద తనదైన బాణిని వినిపిస్తారు. వీటితో పాటు ఆయనకు ఇంకో బాధ్యత ఉంది.

అదే మార్గదర్శి సంస్థ మీద సుప్రీం కోర్టులో న్యాయ పోరటం చేయడం. ఆ పనిలో ఆయన బిజీగా ఉంటున్నారు కూడా. ఇక జేడీ లక్ష్మీనారాయణ గురించి చెప్పుకోవాలంటే ఆయన సీబీఐలో పనిచేసి గడగడలాడించారు. ఆ విధంగా తనకంటూ ఒక చరిష్మాను సృష్టించుకుని అనంతరం రాజకీయాలలోకి వచ్చి 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే ఆయన గత మూడున్నరేళ్ళుగా విశాఖ ప్రాంత సమస్యల మీద పోరాడుతున్నారు. ప్రత్యేకించి ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇక ఈ ఇద్దరు నేతలూ ఇపుడు ఒక చోట కలుస్తున్నారు. దానికి విశాఖ వేదికగా అవుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ విశాఖలో ఈ నెల 20న జరిగే మహా సదస్సులో ఈ ఇద్దరు నాయకులు పాల్గొనబోతున్నారు.

ఉండవల్లి అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ మీద మాటలతో విరుచుకుపడతారు. ఆయన మోడీ విధానాల మీద గట్టిగానే ద్వజమెత్తుతారు. అదే టైం లో ఉండవల్లి తనదైన శైలిలో న్యాయపరమైన అవకాశాలు, చట్టపరంగా ఏ రకంగా ముందుకు సాగవచ్చు అన్నది చెబుతారు. మొత్తానికి చూస్తే ఈ ఇద్దరు నేతలూ మోడీతో ఢీ కొట్టబోతున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయ్వద్దని యుగళం విప్పబోతున్నారు. ఈ మధ్యనే విశాఖ వచ్చిన ప్రధాని స్టీల్ ప్లాంట్ మీద ఏ రకమైన హామీ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. మరో వైపు ఈ నెల 22నాటికి విశాఖ ఉక్కుని పరిరక్షించుకోవడం కోసం కార్మికులు చేస్తున్న ఉద్యమానికి ఆరు వందల రోజులు పూర్తి అవుతుంది. దాంతో నిర్వహిస్తున్న ఈ మహా సదస్సుకు కార్మిక లోకం, ఉద్యోగులు, ఉద్యమకారులు, కళాకారులు, ప్రజా సంఘాలు, రచయితలు, కవులు పౌర సమాజనికి చెందిన మేధావులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.

అతి ముఖ్య ఆకర్షణగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కూడా హాజరై విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దని మోడీకి గట్టిగా చెప్పనున్నారు. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ సదస్సు స్టీల్ ప్లాంట్ ఉద్యమ చరిత్రలో మరో మేలి మలుపు అని అంటున్నారు. ఈ సద్దసు ద్వారా కేంద్రానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవశ్యకతను మరోమారు చాటి చెప్పడంతో పాటు మలి విడత ఉద్యమానికి విశాఖ సహా ఏపీని సన్నద్ధం చేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ఉండవల్లి జేడీ కలయిక మాత్రం కొత్త సమీకరణలకు నాంది అని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.