Begin typing your search above and press return to search.

మాజీ జేడీ క్లారిటీ ఇచ్చారు!

By:  Tupaki Desk   |   10 Aug 2019 4:56 PM GMT
మాజీ జేడీ క్లారిటీ ఇచ్చారు!
X
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ కంటే కూడా ఘోరమైన ఫలితాలను చవిచూసిన కొత్త పార్టీ జనసేన పరిస్థితి ఇప్పుడు దారుణంగానే ఉంది. అసలు పార్టీని తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ కొనసాగిస్తారా? లేదంటే మూసేస్తారా? అన్న మీమాంసలో చాలా మంది జన సైనికులు ఉంటే... గోరు చుట్టపై రోకటి పోటు మాదిరిగా పార్టీలో కీలక నేతగా ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పార్టీ వీడతారంటూ వస్తున్న వార్తలు వారిని మరింత ఆందోళనకు గురి చేశాయి. అయితే వారి ఆందోళనను ఒక్క మాటతో తీసేసిన మాజీ జేడీ... తాను జనసేన నుంచి బయటకు వెళ్లేది లేదని తేల్చేశారు. మొత్తంగా జనసైనికుల ఆందోళనను తగ్గించేసిన ఆయన పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు.

ఎన్నికలకు చాలా ముందుగానే ఐపీఎస్ కు రాజీనామా చేసేసిన లక్ష్మీనారాయణ... పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంతంగానే పార్టీ పెడతారని కొంతకాలం పాటు ప్రచారం జరిగినా... ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ... అనూహ్యంగా జనసేనలో చేరిపోయారు. పార్టీలోకి వచ్చీరాగానే లక్ష్మీనారాయణకు పీకే బాగానే ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయించారు. ఎన్నికల్లో తనదైన మార్కు చూపించిన లక్ష్మీనారాయణ వెరైటీ ప్రచారం చేసి జనాన్ని తనవైపునకు తిప్పుకోగలిగారు. అయితే వైసీపీ వైపు వీచిన బలమైన గాలిలో పీకేతో పాటు మాజీ జేడీ కూడా కొట్టుకుపోయారు.

అయితే జనసేనకు చెందిన ఇతర అభ్యర్థుల కంటే ఓ మోస్తరు అధికంగానే ఓట్లు సాధించిన మాజీ జేడీ... పార్టీ పూర్ ఫెర్ఫార్మెన్స్ నేపథ్యంలో సైడైపోయినట్లు కనిపించారు. అదే సమయంలో పార్టీలో కొత్తగా కమిటీలు వచ్చినా... ఏ ఒక్కదానిలోనూ లక్ష్మీనారాయణ కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని, జనసేనను వదిలేసి బీజేపీలో చేరుతున్నారని వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై అటు లక్ష్మీనారాయణ గానీ, ఇటు జనసేన, పవన్ కల్యాణ్ లు స్పందించకపోవడంతో ఈ వార్తల సంఖ్య మరింతగా పెరిగింది.

ఇలాగే ఉంటే... ఈ ప్రచారం మరింతగా పెరిగిపోతుందేమోనన్న భయంతో ఎట్టకేలకు మాజీ జేడీ బయటకు వచ్చేశారు. తాను జనసేనను వీడట్లేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీకి తన అవసరం లేదని పవన్ కల్యాణ్ భావించనంత కాలం తాను జనసేనను వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలన్నీ కూడా నిరాధారమైనవేనని కూడా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బేస్ లెస్ వార్తలను వండివార్చే బదులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా లక్ష్మీనారాయణ ఇచ్చిన క్లారిఫికేషన్ తో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడిపోగా... జన సైనికుల్లో ఆందోళన కూడా తగ్గిపోయిందనే చెప్పాలి.