Begin typing your search above and press return to search.

మాజీ జేడీ రూట్ క్లియ‌ర్‌!... జ‌న‌సేన‌లో చేరిక‌!

By:  Tupaki Desk   |   17 March 2019 7:07 AM GMT
మాజీ జేడీ రూట్ క్లియ‌ర్‌!... జ‌న‌సేన‌లో చేరిక‌!
X
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఎట్ట‌కేల‌కు త‌న రూటేంటో చెప్ప‌నే చెప్పేశారు. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఇంకా ఎలాంటి స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం తీసుకోలేద‌నే ప్ర‌క‌టిస్తూ వ‌చ్చిన ల‌క్ష్మీనారాయ‌ణ... ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆధ్వ‌ర్యంలోని జ‌న‌సేన‌లో ఆయ‌న చేరిపోయారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం జ‌న‌సేన కార్యాల‌యానికి వ‌చ్చిన ఆయ‌న‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి లక్ష్మీనారాయణను జనసేనలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మంచి జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదరణ.. ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు. ప్రజల కోసం, ప్రజాసేవలో పనిచేస్తున్న పవన్‌ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. జనసైనికుల్లో తాను కూడా ఒకడిగా మారిపోయానని తెలిపారు. పవన్‌ మార్గదర్శకత్వంలో మనమంతా ముందుకువెళ్తూ.. ప్రజలు మనపై పెట్టుకున్న ఆశలను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తామన్నారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే... *మనం ముందుకెళ్దాం.. దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఎంటో చూపిద్దాం* అంటూ ఆయ‌న ఓ సెటైరిక్ డైలాగ్ వ‌దిలారు. ఈ వ్యాఖ్య‌లు చూస్తుంటే... ప‌వ‌న్ కంటే కూడా జ‌న‌సేన నుంచి ల‌క్ష్మీనారాయ‌ణ నుంచే ఇక‌పై జ‌నాన్ని ఆక‌ట్టుకునే డైలాగులు వినిపిస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. వ‌చ్చీ రాగానే తనకు పార్టీలో అవకాశం కల్పించినందుకు పవన్‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలా ఉంటే... పోలీసు అధికారి ప‌ద‌వికి రాజీనామా చేసిన ల‌క్ష్మీనారాయ‌ణ‌తో క‌లిసి న‌డిచేందుకు సిద్ధ‌మైన శ్రీ కృష్ణ‌దేవ‌రాయ విశ్వ‌విద్యాల‌యం మాజీ వీసీ రాజగోపాల్‌ కూడా ఆయ‌న‌తో పాటే పవన్‌ ఆధ్వర్యంలో జనసేలో చేరారు. నాడు ల‌క్ష్మీనారాయ‌ణ ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేసిన మ‌రుక్ష‌ణ‌మే వీసీ ప‌ద‌వికి కూడా రాజ‌గోపాల్ రాజీనామా చేసి సంచల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై తాను కూడా ల‌క్ష్మీనార‌య‌ణ అడుగుజాడ‌ల్లోనే న‌డుస్తానంటూ నాడు ప్ర‌క‌టించిన రాజగోపాల్... ల‌క్ష్మీనారాయ‌ణ స‌మాజాన్ని మార్చేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

ఇక జ‌న‌సేన‌లో చేరిపోయిన ల‌క్ష్మీనార‌య‌ణ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం కూడా ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే ఆయ‌న‌ను ఎక్క‌డి నుంచి బ‌రిలోకి దించుతార‌న్న విష‌యంపై ఆస‌క్తి రేకెత్తిస్తోంది. మొన్న‌టిదాకా ఈ ఎన్నిక‌ల‌కు ల‌క్ష్మీనారాయ‌ణ దూరంగానే ఉంటార‌ని భావించినా... అంద‌రికీ షాకిస్తూ జ‌న‌సేన‌లో చేరిపోవ‌డంతో ఆయ‌న పోటీ ఖాయ‌మేన‌ని చెప్పాలి. మ‌రి ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీకి దించుతారో చూడాలి.