Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   9 Dec 2022 9:46 AM GMT
వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే పోటీ చేస్తా: జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు!
X
వచ్చే ఎన్నికల్లోనూ తన పోటీపై సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ విశాఖపట్నం పార్లమెంటు నుంచే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

తన విధానాలు, ఆలోచనలతో ఏకీభవించే పార్టీలో తాను చేరే అవకాశం ఉందన్నారు. లేదంటే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని తెలిపారు. 2019 ఎన్నికల ముందు మహారాష్ట్ర కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న లక్ష్మీ నారాయణ స్వచ్ఛంధ పదవీ విరమణ చేశారు.

ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. 2,88,874 ఓట్లు సాదించారు. మొత్తం ఆయనకు 23 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికలయ్యాక పవన్‌ కల్యాణ్‌ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని అంగీకరించలేక జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.

ఆ తర్వాత టీడీపీలో, వైఎస్సార్‌సీపీలో, బీజేపీలో ఇలా పలు పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయని.. ఆ పార్టీల్లో చేరనున్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు.

ప్రస్తుతం లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి సాగు చేస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల ఆహ్వానం మేరకు వాటిని సందర్శిస్తున్నారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. జనసేనలోనే ఆయన చేరే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష్మీనారాయణ సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే.

వైసీపీ అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో జగన్‌ను హైదరాబాద్‌లో విచారించింది జేడీ లక్ష్మీనారాయణే కావడం గమనార్హం. అప్పుడు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ వ్యవహరించారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.