Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంటుపై హైకోర్టులో జేడీ పిటిషన్ !

By:  Tupaki Desk   |   30 March 2021 12:10 PM GMT
స్టీల్ ప్లాంటుపై హైకోర్టులో జేడీ పిటిషన్ !
X
ఏపీ వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఉద్యమ నినాదం ఎగసిపడుతోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా కీలక నేతలంతా ఉక్కు ఉద్యమంలో మేము సైతం అంటున్నారు. ఇటీవల అనకాపల్లిలోని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యాలయంలో.. గంటా శ్రీనివాసరావుతో మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో రాజకీయ పరంగా, న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలి అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది.

దీనిలో భాగంగా జేడీ లక్ష్మి నారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఐపీఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయెద్దంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. కార్మిక సంఘాలు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నిలచారు లక్ష్మీనారాయణ. అంతేకాదు, ఏం చేస్తే స్టీల్ ప్లాంటును లాభాల బాటలోకి మళ్లించవచ్చో వివరిస్తూ... కేంద్రానికి లేఖ కూడా పంపారు. అంతేకాదు, పార్టీల నేతలు, మేధావులతో కూడా చర్చలు జరుపుతూ ఉద్యమానికి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమలోని 100 శాతం వాటాలను అమ్ముతున్నట్లు ఈ నెల 8న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించిన దగ్గర నుంచి ఆందోళనలు ఉద్ధృతం అయ్యాయి. ఆ రోజు రాత్రి నుంచే విరామం లేని పోరాటం చేస్తున్నారు కార్మికులు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం వ్యాపించింది. ప్రస్తుతం కార్మిక, విద్యార్థి, రాజకీయ సంఘాలకు మాత్రమే పరిమితమైన ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ ఉద్యమానికి ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలి అంటూ కార్మిక సంఘాలు పిలుపు ఇస్తున్నాయి. మరోవైపు రాజకీయ నేతలు, మేధావులు, మాజీ అధికారులు ఎవరి పంతాలో వారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.