Begin typing your search above and press return to search.

ఆ పార్టీని టెన్షన్ పెడుతున్న సుమలత!

By:  Tupaki Desk   |   12 March 2019 11:05 AM GMT
ఆ పార్టీని టెన్షన్ పెడుతున్న సుమలత!
X
మాజీ మంత్రి - నటుడు అంబరీశ్‌ సతీమణి సుమలత రాజకీయ ప్రవేశం కర్నాటకలో ఆసక్తికరంగా మారింది. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మండ్య పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయాలని సుమలత భావిస్తున్నారు. ఈక్రమంలో తన భర్త కొనసాగిన కాంగ్రెస్‌ తరఫున టికెట్‌ ఆశించారు. అయితే కాంగ్రెస్‌ పెద్దలు మండ్య టికెట్‌ సాధ్యం కాదని.. జేడీఎస్‌ తో మైత్రిలో భాగంగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ కు ఇవ్వాలని వివరించడంతో ఆమె స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయినట్లు సమాచారం. ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ మండ్య నుంచి కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చినా పోటీ చేస్తాను.. ఇవ్వకుంటే స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మండ్య వీడేది లేదని తెలిపారు. ఈనేపథ్యంలో సుమలతకు బీజేపీ గాలం వేసినట్లు సమాచారం. తమ పార్టీలోకి వస్తే మండ్య టికెట్‌ కూడా ఇస్తామని ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. అయితే ఆమె కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తాను.. లేదంటే స్వతంత్య్రంగా బరిలో దిగుతానని మీడియాతో తెలిపారు.

అంతే కానీ ఏ ఇతర పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. దీంతో తాము పరోక్షంగా మద్దతు ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఫోన్‌ చేసి సుమలతకు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా మండ్య పార్లమెంట్‌ లోని కాంగ్రెస్‌ నాయకులు కూడా కొందరు పరోక్షంగా సుమలతకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సుమలతను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ పెద్దలు ప్రణాళిక రచించారు. ఈమేరకు మాజీ సీఎం ఎస్‌ ఎం కృష్ణ ద్వారా రాయబారం పంపించారు. సుమలత బీజేపీలో చేరినా.. సరే లేనిపక్షంలో ఆమె స్వతంత్య్రంగా బరిలో దిగితే బీజేపీ పోటీలో ఉండబోదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా మండ్యలో జేడీఎస్‌ ను ఓడించాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు బహిర్గతం అవుతోంది.

అంబరీశ్‌ గతంలో కాంగ్రెస్‌ లో కొనసాగారు. ఎమ్మెల్యేగా - ఎంపీగా - మంత్రిగా సేవలు అందించారు. అయితే ఆయన సతీమణి ప్రస్తుతం కాంగ్రెస్‌ తరఫున మండ్య పార్లమెంట్‌ టికెట్‌ ఆశించారు. అయితే కాంగ్రెస్‌ – జేడీఎస్‌ మైత్రిలో భాగంగా మండ్య స్థానాన్ని జేడీఎస్‌ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో కాంగ్రెస్‌ పెద్దలు మండ్య కాకుండా బెంగళూరు ఉత్తర లేదా దక్షిణ స్థానం ఇస్తామని చెప్పగా ఆమె ఒప్పుకోలేదు.

సీఎం తనయుడు - సినీనటుడు నిఖిల్‌ కుమారస్వామి ఈసారి రాజకీయ అరంగేట్రం చేస్తారని మాజీ ప్రధాని హెచ్‌ డీ దేవెగౌడ ప్రకటించారు. ఈక్రమంలో మండ్య పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేయిస్తామని చెప్పారు. పొత్తులో భాగంగా మండ్య స్థానం తమకే కావాలని కాంగ్రెస్‌ తో ఒప్పందం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే సుమలత పోటీ చేస్తే నిఖిల్‌ కుమార్‌ గెలుపు కష్టమేనని సమాచారం.

అంబరీశ్‌ అభిమానులు - కాంగ్రెస్‌ లోని కొందరు నాయకులు - బీజేపీ పరోక్ష మద్దతు కలిస్తే సుమలత విజయం సులువు అవుతుంది. ఫలితంగా ఆదిలోనే నిఖిల్‌ కుమార్‌ కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం లేకపోలేదు. ఒకవేళ బీజేపీ బరిలో దిగినా.. డమ్మీ అభ్యర్థిని నిలబెడుతారని తెలుస్తోంది. ఫలితంగా సుమలత స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తే గెలవడం ఖాయమని అక్కడి ప్రజలు చెబుతున్నారు.