Begin typing your search above and press return to search.

క‌న్న‌డ ర‌చ్చ‌..ఇలా బ్రేక్ ప‌డ‌వ‌చ్చు

By:  Tupaki Desk   |   31 May 2018 12:29 PM GMT
క‌న్న‌డ ర‌చ్చ‌..ఇలా బ్రేక్ ప‌డ‌వ‌చ్చు
X
క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఉత్కంఠ ప‌రిణామాల ప‌రంప‌ర కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజులవుతున్నా...ఇప్పటివరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఎవరు ఏ శాఖ తీసుకోవాలన్నదానిపై రెండు పార్టీల మధ్య అవగాహన కుదరడం లేదు. అయితే మొత్తానికి కీలక శాఖల విషయంలో రెండు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ కు హోంశాఖ - జేడీఎస్‌ కు ఆర్థిక శాఖ దక్కనున్నట్లు సమాచారం.

జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ప్రమాణం చేసిన‌ప్ప‌టికీ రాష్ట్ర క్యాబినెట్‌ను మాత్రం విస్తరించలేదు. ఆ రాష్ర్టానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో రెండ్రోజుల కింద‌ట‌ సమావేశం ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియాతో కలిసి అమెరికా వెళ్లడంతో కర్నాటక క్యాబినెట్ విస్తరణ ఆలస్యంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయని అంచ‌నాలు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను సీఎం అయినట్లు కుమారస్వామి వ్యాఖ్యానించారు. సీఎంగా కర్నాటక రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడం తన బాధ్యత అని ఆయన అన్నారు. కానీ ఏది చేయాలన్నా.. కాంగ్రెస్ నేతల అనుమతి తీసుకోవాలని, వాళ్ల పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ఆయ‌న ఈ స్థాయిలో ఆధార‌ప‌డి ఉండ‌టంతో మంత్రి ప‌ద‌వుల విష‌యంలో ఏం చేయ‌నున్నార‌నే ఉత్కంఠ నెల‌కొంది.

కాగా, ఎట్ట‌కేల‌కు దీనిపై కొలిక్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రెండు రోజులుగా శాఖల కేటాయింపుపై రెండు పార్టీల నేతలు ఐదుసార్లు సమావేశమయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఈ విషయమై ఇక్కడి నేతలతో ఫోన్లో మాట్లాడారు. `మేం ఇప్పటికే ఐదుసార్లు సమావేశమయ్యాం. చర్చల తర్వాత ఆర్థిక శాఖ జేడీఎస్‌ కు ఇవ్వాలని నిర్ణయించారు. నేను బెంగళూరు వెళ్లి మా పార్టీ నేతలతో మాట్లాడతాను అని జేడీఎస్ నేత డానిష్ అలీ వెల్లడించారు. కుమారస్వామి - దేవెగౌడలతో కలిసి చర్చిస్తా` అని చెప్పారు.