Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు జేడీఎస్ ఝలక్.. బీజేపీతో దోస్తీ?

By:  Tupaki Desk   |   17 May 2019 2:30 PM GMT
కాంగ్రెస్ కు జేడీఎస్ ఝలక్.. బీజేపీతో దోస్తీ?
X
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త మిత్రులు కలిసి రావడం అటుంచి.. ఉన్న వాళ్లు చేజారే అవకాశాలు మాత్రం తెర మీదకు వస్తూ ఉన్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ముందు వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు అత్యంత హాట్ హాట్ గా మారాయి. అందులో భాగంగా కర్ణాటకలో కూడా రాజకీయం రసకందాయకంలో పడింది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ- జేడీఎస్ లు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ సంకీర్ణంలో లుకలుకలు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్లు జేడీఎస్ తీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కుమారస్వామి మీద అసహనంతో ఉన్నారు. తను మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రెడీ అన్నట్టుగా సిద్ధరామయ్య మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు జేడీఎస్ లో అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తో బంధాన్ని తెంచుకుని జేడీఎస్ తన దారి తను చూసుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉండటం విశేషం. జేడీఎస్ చేతిలో నలభై వరకూ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ పార్టీ ఎవరితో దోస్తీ కలిపితే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి ఆ రాష్ట్రంలో. కాంగ్రెస్ తో దోస్తీ చేస్తున్న జేడీఎస్ సీఎం సీటును తనే పొందింది. అయితే ఉన్నది స్వల్పమెజారిటీ మాత్రమే.

ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో ఎవరికీ తెలియదు. అదే జేడీఎస్ వాళ్లుబీజేపీతో చేతులు కలిపితే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే జేడీఎస్ కు సీఎం సీటును ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకోదు. కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిని అయితే ఇస్తుంది. ఈ మేరకు డీల్ కుదిరే అవకాశం ఉందని భోగట్టా.

దేవేగౌడ తనయుల్లో ఒకరైన రేవణ్ణకు బీజేపీ వాళ్లు ఉప ముఖ్యమంత్రి పదవిని, ప్రస్తుత సీఎం కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవిని ఆఫర్ చేసి బీజేపీ వాళ్లు ఈ పార్టీని తమ వైపుకు తిప్పుకునే అవకాశాలున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ డీల్ కు జేడీఎస్ ఓకే అంటే కాంగ్రెస్ కు ఝలక్ తప్పదు.

కేంద్రంలో మళ్లీ బీజేపీ వాళ్లు ఎన్డీయే రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే.. కర్ణాటకలో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖరారు అయినట్టే. అలాంటి సందర్భంలో బీజేపీతో జేడీఎస్ సంధిని కుదుర్చుకోవచ్చు కూడా!