Begin typing your search above and press return to search.

జగన్ ను కేసులేమీ చేయలేవంటున్న లీడర్!

By:  Tupaki Desk   |   21 Dec 2016 10:35 AM GMT
జగన్ ను కేసులేమీ చేయలేవంటున్న లీడర్!
X
తెలంగాణ రాజకీయాల్లో జగన్ క్రియాశీలంగా లేకపోయినా తెలంగాణలోని నేతలు మాత్రం జగన్ గురించి మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు చెబుతున్నట్లుగా కేసుల వల్ల జగన్ కు ఏదో అయిపోతుందన్న ఆందోళన ఎవరికీ అవసరం లేదని.. జగన్ పై కేసులేవీ నిలబడవని పలువురు సీనియర్ లీడర్లే అంటున్నారు. అంతేకాదు... జగన్ పై ఇన్ని కేసులు బనాయించడానికి కారణమెవరు... వైఎస్ ను అవినీతిపరుడిగా చూపడం వల్ల ఎవరికి నష్టం వంటి అనేక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్ - మాజీ మంత్రి... అన్నిటికీ మించి మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ముక్కుసూటి నేత జీవన్ రెడ్డి తన అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

వైఎస్ ను అవినీతిపరుడిగా చూపించేందుకు ప్రయత్నించడం వల్ల అంతిమంగా కాంగ్రెస్‌ పార్టీయే నష్టపోయిందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ పై అవినీతి ముద్ర వేయాలని భావిస్తే, అది అంతిమంగా కాంగ్రెస్‌ కే తగిలిందన్నారు. వైఎస్‌ ఆరే అవినీతి పరుడిగా ఎస్టాబ్లిష్‌ అయితే, కాంగ్రెస్సే అవినీతికరమైన పార్టీగా నిలిచిపోతుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… సీఎం స్థానంలో ఉండి వైఎస్ తీసుకున్న ఏ నిర్ణయమైనా కేబినెట్‌ సమిష్టి నిర్ణయమని అక్కడ తీసుకున్న నిర్ణయాలకు ఏ ఒక్కరినో బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. వైఎస్‌ జగన్‌ పై క్విడ్‌ ప్రో కో అనీ, వైఎస్‌ తీసుకున్న నిర్ణయాలు జగన్‌ కి లబ్ధి చేసిన నిర్ణయాలు అని చేస్తున్న ఆరోపణలు ఏ కోర్టులోనూ నిరూపితం కావన్నారు. శంకర్రావు వ్యక్తిగతంగా కేసు వేశారే కాని కాంగ్రెస్‌ అధిష్టానానికి దాంతో సంబంధం లేదన్నారు.

అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాత్రమే ఈ విషయంలో కొంత పొరపాటు చేశారని…. సీఎంగా ఉండి కూడా కోర్టులో ప్రభుత్వం తరఫున ఈ కేసుల్లో ఎలాంటి ఫైలూ కౌంటర్‌ దాఖలు చేయలేదని తప్పుపట్టారు. జగన్‌ పై కేసులు వేసిన విషయంలో అంతిమంగా నష్టపోయింది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు. కోర్టునుంచి డైరెక్షన్‌ రావడంతో అలా కేసులు పెట్టడం జరిగింది తప్పితే జగన్‌ పై ఏ కేసు కూడా నిలబడే అవకాశం లేదన్నారు.

క్విడ్‌ ప్రో కో అనేదాంట్లో ఎవరికైనా లబ్ధి చేకూరి ఆ క్రమంలో భాగంగా జగన్‌ కూడా లబ్ధి పొంది ఉంటే, వాళ్లకు అతడు చేకూర్చిన లబ్ధి ఏమేరకు జరిగింది అనేది ముందు చూడాలన్నారు. వందకోట్ల ప్రాజెక్ట్ లో.. పది కోట్లు క్విడ్‌ ప్రో కో జరిగిందంటే అర్థముంది గానీ… వందకోట్ల విలువైన ప్రాజెక్టులో వెయ్యికోట్ల విలువైన క్విడ్‌ ప్రో కో జరిగి ఉండటానికి అవకాశమే లేదుకదా అని ప్రశ్నించారు. ఇది సింపుల్‌ లాజిక్‌. ఉద్దేశపూర్వకంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరికైనా లాభం చేకూర్చి ఉంటే మొదట అది కేబినెట్‌ దృష్టికి వస్తుందని…. మంత్రివర్గానికి తెలియకుండా జరిగే అవకాశమే ఉండదని జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంత చేసిన సీబీఐ మంత్రివర్గం జోలికి ఎందుకు వెళ్లలేదో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. ఇవన్నీ జగన్‌ కేసునుంచి బయటపడడానికి చక్కగా ఉపయోగపడుతాయన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/